తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వాళ్లకి వలసవాద మత్తు వదలలేదు.. తెల్లవారు చెప్పిందే వారికి వేదం'

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ విషయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్​ రిజిజు ఘాటుగా స్పందించారు. కొంత మందికి 'వలసవాద మత్తు' ఇంకా వదలలేదని చురకలంటించారు. ఈ విషయంపై అమెరికా కూడా స్పందించింది.

kiran Rijiju on BBC documentary
kiran Rijiju on BBC documentary

By

Published : Jan 24, 2023, 12:36 PM IST

Updated : Jan 24, 2023, 1:59 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పెను దూమారం రేపుతోంది. ఈ అంశంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్​ రిజిజు ఘాటగా స్పందించారు. కొంత మందికి 'వలసవాద మత్తు' ఇంకా వదలలేదని.. వారింకా శ్వేతజాతీయలే తమ పాలకులు అని భావిస్తున్నారని ధ్వజమెత్తారు." కొంత మందికి, ఇండియా​ గురించి.. తెల్లవారు చెప్పిందే వేదం.. భారత సుప్రీం కోర్టు, భారత ప్రజలు చెప్పింది కాదు అని అనుకుంటున్నారు" అని ట్విట్టర్​ వేదికగా చురకలంటించారు. ఓ జాతీయ పత్రిక ప్రచురించిన కథనంపై స్పందిస్తూ.. 'దేశం లోపల, వెలుపల చేస్తున్న విష ప్రచారాలు, కుట్రల ద్వారా భారత్​ ప్రతిష్ఠను దిగజార్చలేరు. ప్రధాని నరేంద్ర మోదీ 140 కోట్ల మంది గొంతుక' అని పేర్కొన్నారు.
ఈ విషయంపై 300 మంది విశ్రాంత న్యాయమూర్తులు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఆర్మీ మాజీ అధికారులు స్పందించారు. భారతదేశం, దేశ నాయకుడి పట్ల పక్షపాత వైఖరితో బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిందని ప్రకటన సంతకం చేశారు.

స్పందించిన అమెరికా ..
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రాజేసిన వివాదంపై అమెరికా కూడా స్పందించింది. ఆ డాక్యుమెంటరీ గురించి తమకు తెలియదని, భారత్‌, అమెరికా రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలని, వాటి విలువల గురించి మాత్రమే తెలుసని అగ్రరాజ్యం తెలిపింది. 2002 గుజరాత్ అల్లర్లపై ఇండియా.. ది మోదీ క్వశ్చన్ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది.

"మీరు చెప్పిన బీబీసీ డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. అనేక అంశాల ఆధారంగా భారత్- అమెరికా మధ్య ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉంది. ఇరుదేశాల మధ్య రాజకీయంగా, ఆర్థికంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత్-అమెరికా ప్రజల మధ్య లోతైనా సంబంధాలు కూడా ఉన్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికాలను వాటి విలువలే కలిపాయి."
--నెడ్‌ ప్రైస్‌, అధికార ప్రతినిధి అమెరికా విదేశాంగ శాఖ

ఈ డాక్యుమెంటరీపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండుదేశాలను కలిపి ఉంచే అంశాలపైనే తమ దృష్టి ఉంటుందని, తమ మధ్య బంధాన్ని బలోపేతం చేసే విషయాల గురించి ఆలోచిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఇదివరకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ కూడా ఇదేవిధంగా స్పందించారు. డాక్యుమెంటరీలోని విషయాలను తాను పూర్తిగా అంగీకరించలేనని తేల్చి చెప్పారు.

'ఇండియా : ది మోదీ క్వశ్చన్'
బీబీసీ సంస్థ 2002 గుజరాత్ అల్లర్లపై 'ఇండియా : ది మోదీ క్వశ్చన్' పేరిట రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీని ఇండియా తీవ్రంగా ఖండించింది. అదొక విద్వేషపూరిత చర్యగా పేర్కొంది. దీనిపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. 'ఇది ఒక ప్రచార కార్యక్రమం. వారు ఎంచుకున్న కోణాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే ఈ డాక్యుమెంటరీ రూపొందించారు' కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ డాక్యుమెంటరీపై తీవ్ర దూమారం రేగిన నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు చేయాలంటూ యూకేలో ఆన్‌లైన్‌ పిటిషన్‌ దాఖలైంది. గతవారం ప్రసారమైన మొదటి భాగంలో దుష్ప్రచారం ఎక్కువగా ఉందని, వీక్షకులను తప్పుదోవ పట్టించేలా ఉందని, సరైన ప్రమాణాలను పాటించకుండా డాక్యుమెంటరీ రూపొందించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మంగళవారం ప్రసారమయ్యే రెండో భాగాన్ని నిలిపివేయాలని కోరారు.

Last Updated : Jan 24, 2023, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details