కొవిడ్ టీకాల(Covid Vaccine) విషయంలో దేశీయ పంపిణీనే తొలి ప్రాధాన్యమని, విదేశాలకు ఎగుమతి డోసుల అందుబాటుపై ఆధారపడి ఉంటుందన్నారు విదేశాంగ ప్రతినిధి అరిందం బాగ్చి. దేశంలో తయారైన టీకాలను స్థానికంగా వినియోగించుకునేందుకే కేంద్రం మొగ్గు చూపుతోందని తెలిపారు. డోసుల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు టీకా ఎగుమతికి సంబంధించి వస్తున్న వార్తలపై గురువారం ఈ విధంగా స్పందించారు.
ఫైజర్(Pfizer) వ్యాక్సిన్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తోందని పేర్కొన్నారు బాగ్చి. భారత్ బయోటెక్(Bharat Biotech) సంస్థ రూపొందించిన కొవాగ్జిన్(Covaxin)కు విదేశాల్లో అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ నుంచి అనుమతికి సంబంధించి కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తోందన్నారు.