విద్య, ఉద్యోగాల్లో ఇంకెన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మరాఠా కోటా అంశంపై విచారణ సందర్భంగా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఈ ప్రశ్నను సంధించింది. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తే తలెత్తే 'అసమానతల'పై ఆందోళన వ్యక్తంచేసింది. రిజర్వేషన్లపై పరిమితి విధించిన 'మండల్ తీర్పు'ను.. మారిన పరిస్థితుల్లో పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. కోటాలను నిర్దేశించే అంశాన్ని కోర్టులు.. రాష్ట్రాలకే వదిలేయాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం కోటా ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా 50 శాతం కోటాను ఉల్లంఘించిందన్నారు.
'మీరు చెబుతున్నట్లు 50 శాతం పరిమితి లేకుంటే.. దాని కారణంగా తలెత్తే అసమానతల పరిస్థితేంటి? అంతిమంగా దాన్ని మేం తేల్చాల్సి ఉంటుంది. ఈ అంశంపై మీ వైఖరేంటి? ఎన్ని తరాలపాటు దీన్ని కొనసాగిస్తారు' అని ధర్మాసనం ప్రశ్నించింది.