Flying Object In Manipur :ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గాల్లో ఎగిరిన గుర్తు తెలియని వస్తువు కోసం భారత వైమానిక దళం గాలిస్తోంది. గగనతల నియంత్రణ వ్యవస్థ-ATC సహా ఇతర వ్యవస్థలు ఇచ్చిన సమాచారంతో భారత వైమానిక దళం-IAF అప్రమత్తమైంది. గాల్లో ఎగిరిన గుర్తుతెలియని ఆ వస్తువును కనిపెట్టేందుకు షిల్లాంగ్ కేంద్రంగా పనిచేసే ఈస్టర్న్ కమాండ్ నుంచి ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని పంపారు.
రెండు రఫేల్ యుద్ధ విమానాలతో గాలించినా..
Unidentified Flying Object Manipur : అయితే రఫేల్ యుద్ధ విమానం ఇంఫాల్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో గాలించినా ఏమీ కనిపించలేదని వాయుసేన అధికారులు చెప్పారు. అది తిరిగొచ్చిన తర్వాత మరో రఫేల్ యుద్ధవిమానాన్ని కూడా పంపి.. గాల్లో ఎగిరిన వస్తువు కోసం వెతికారు. అయినా ఏమీ కనిపించలేదని చెప్పారు. వెంటనే చైనా సరిహద్దుల వెంబడి ఉన్న ఈస్టర్న్ కమాండ్‌కు సంబంధించిన గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశారు.
పౌర విమానాలు నిలిపివేత!
ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లో గుర్తుతెలియని వస్తువు.. గాల్లో ఎగరడం పెద్ద కలకలమే సృష్టించింది. నేరుగా అందరి కంటికి కనిపించిన ఈ వస్తువును గమనించిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది.. గగనతల నియంత్రణ వ్యవస్థ-ATCకి సమాచారం అందించారు. వెంటనే అన్ని పౌర విమానాలను నిలిపివేశారు. దాదాపు 3గంటలు ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు ఆగిపోయాయి. ఇంఫాల్‌కు రావాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. ఇంఫాల్ నుంచి టేకాఫ్ కావాల్సిన 3 విమానాలు ఆలస్యమయ్యాయి. ఈ సందర్భంగా ఇంఫాల్ విమానాశ్రయం వద్ద భారీగా CISF, పోలీసు బలగాలను మోహరించారు. మూడు గంటల గడిచిన తర్వాత అన్ని అనుమతులు ఇవ్వడం వల్ల విమానాశ్రయం నుంచి విమానాలు రాకపోకలు సాగించాయి.
"ఇంఫాల్ ఎయిర్‌పోర్టు వద్ద గుర్తుతెలియని వస్తువు గురించి సమాచారం అందగానే.. సమీపంలోని ఎయిర్‌బేస్ నుంచి ఓ రఫేల్ యుద్ధ విమానాన్ని ఐఏఎఫ్ పంపించింది. అడ్వాన్స్‌డ్ సెన్సర్లు కలిగిన ఈ అధునాతన ఫైటర్ జెట్.. అనుమానిత ప్రాంతంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ ఆ వస్తువు కోసం గాలించింది. అయితే ఎక్కడా అలాంటి వస్తువు కనిపించకపోవడం వల్ల ఆ యుద్ధ విమానం తిరిగొచ్చింది. ఆ తర్వాత కాసేపటికి మరో రఫేల్ ఫైటర్ జెట్ గాలించినా.. ఎలాంటి యూఎఫ్‌వో కన్పించలేదు" అని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.