కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియల కారణంగా మంగళవారం (జులై 27) నాటికి 209 మంది చనిపోయారు. మరో 8 మంది గల్లంతయ్యారు. 58, 722 పశుపక్ష్యాదులు మృతిచెందాయి. 4,34,185 మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.
ముంబయి, రాయ్‌గఢ్, రత్నగిరి, పాల్ఘడ్, ఠాణె, సింధుదుర్గ్, కోల్హాపుర్, సతారా, సంగ్లీ జిల్లాల్లో వర్షాలు కల్లోలం సృష్టించాయి. ప్రస్తుతం 16 ఎన్డీఆర్ఎఫ్, 3 ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.
308 వసతి కేంద్రాల్లో 2.51 లక్షల మందికి భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. తీవ్రంగా ప్రభావితమైన రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలకు రూ.2 కోట్లు చొప్పున, ఇతర జిల్లాలకు రూ.50లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
రాయ్‌గఢ్ జిల్లా కొండల్కర్ వాడిలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ పర్యటించి ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలపై ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ గ్రామస్థులకు పునరావాసం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.
రత్నగిరి- వర్ష బీభత్సానికి వణికిపోయిన చిప్లున్ పట్టణంలో బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు కోశ్యారీ.
సింధుదుర్గ్- భారీ వానలకు జిల్లాలో ఎన్నో జీవితాలు ఛిద్రమయ్యాయి. 39 గ్రామాల్లో 290 కుటుంబాల్లోని 1,271 మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలించారు.