Mumbai Flight Crash :ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి వెళ్లిన ఓ విమానం.. మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయంలో భారీ ప్రమాదానికి గురైంది. ప్రైవేటు సంస్థకు చెందిన ఆ చిన్న విమానం రన్‌వేపై అదుపు తప్పి.. పక్కకు దూసుకెళ్లి క్రాష్ అవగా ఎనిమిది మంది గాయపడ్డారు. ఘటన సమయంలో భారీ వర్షం కురుస్తోందని డీజీసీఏ అధికారులు వెల్లడించారు. విమానంలో ఆరుగురు ప్రయాణికులతోపాటు ఇద్దరు సిబ్బంది ఉండగా.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై మంటలు చెలరేగకుండా చర్యలు చేపట్టారు.
విమానంలో ఉన్న అందరికీ గాయాలు..
Flight Crash At Mumbai Airport : ప్రమాదానికి గురైన విమానాన్ని VSR వెంచర్స్‌కు చెందిన లీర్‌జెట్ 45 VT-DBLగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న వారంతా గాయపడ్డారని.. చికిత్స కోసం వారిని ఆస్పత్రి తరలించినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. గురువారం సాయంత్రం ఐదు గంటలో ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది.
Aircraft Crash Mumbai : "సెప్టెంబరు 14వ తేదీన.. VSR వెంచర్స్‌కు చెందిన లీర్‌జెట్ 45 VT-DBL విమానం ముంబయి ఎయిర్పోర్ట్ రన్‌వే 27పై ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది. ఘటన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లోని రెండు రన్వేలు కొన్ని గంటలపాటు మూసివేశాం. ఆ తర్వాత యథావిథిగా విమాన రాకపోకలు జరుగుతున్నాయి" అని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.