వరదల దాటికి హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ధర్మశాలలోని భగ్సునాగ్‌లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. రోడ్డుపై ఉన్న కార్లు కాగితం పడవల్లా కొట్టుకుపోయాయి. చేసేదేం లేక ప్రజలు చూస్తూ ఉండిపోయారు. కొన్ని వాహనాలు నీటిలో తేలియాడాయి. వరదలో వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్లలో బంధించారు.
దెబ్బతిన్న దుకాణాలు..
ధర్మశాల పరిసర ప్రాంతంలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. భారీ వర్షాల దాటికి నదులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద దాటికి మంజీ నది పరిసరాల్లో సుమారు 10 దుకాణ సముదాయాలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల వరదనీరు రహదారిపైనుంచి ప్రవహించింది.
నీటి ఉద్ధృతి..
ఆదివారం అర్థరాత్రి నుంచి కాంగ్రా జిల్లాలో కురిసిన వర్షం కారణంగా పర్యాటక పట్టణం ధర్మశాలలోని వరదలాంటి పరిస్థితి తలెత్తింది. భగ్సునాగ్ నాలా కాస్త నదిగా మారిపోయింది. నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. నీటి ఉద్ధృతికి రహదారిపై చాలా వాహనాలు కొట్టుకుపోగా.. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఒడ్డున నిర్మించిన ఇళ్ళు, హోటళ్ళు, మార్కెట్‌కు తీవ్ర నష్టం కలిగింది.