దేశంలోని మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిపై పొరుగింటిలో ఉండే ఓ 15 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో ఇల్లు చేరిన బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ జరిగింది:ఆదివారం మధ్యాహ్నం.. ఇంటి సమీపంలో అడుకుంటున్న బాలికను చాక్లెట్ ఇస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు 15 ఏళ్ల బాలుడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఏడుపులతో భయపడి నోరు మూసి వారి ఇంటి వద్ద వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ తన తల్లివద్దకు వెళ్లింది బాలిక. తనపై జరిగిన అఘాయిత్యాన్ని తెలిసి తెలియని మాటల్లో వివరించింది. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. సాయంత్రంలోపు నిందితుడిని పట్టుకున్నట్లు ప్రతాప్‌నగర్ పోలీసులు చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.