Assembly election schedule: శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో మరికొద్ది రోజుల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల గడువు మార్చితో ముగియనుండగా.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు మే నెలతో పూర్తవుతుంది. ఈ రాష్ట్రాలకు మార్చి-ఏప్రిల్ మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. యూపీలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా.. ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Five states assembly election
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. వైరస్ ఉద్ధృతి వేళ.. ఎన్నికల ప్రచారాలు సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ అయ్యింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని పార్టీలు కోరుతున్నాయని ఈసీ ఇటీవల వెల్లడించింది. మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతోనూ పలుమార్లు భేటీ అయిన ఈసీ.. కొవిడ్ పరిస్థితుల గురించి ఆరాతీసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని కేంద్రాన్ని సూచించింది.
ప్రచార ర్యాలీలపై ఉత్తరాఖండ్ నిషేధం
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న వేళ ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, ధర్నాలు, ఇతర ప్రదర్శన కార్యక్రమాలపై జనవరి 16 వరకు నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తరాఖండ్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 800లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. పలు ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. జనవరి 16 వరకు ఎన్నికల ర్యాలీలు, సభలపై నిషేధం విధించింది. దీంతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, స్విమ్మింగ్ పూల్స్, వాటర్ పార్క్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక జిమ్‌లు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, సెలూన్లు, స్పా సెంటర్లు, ఆడిటోరియంలను 50శాతం సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇక ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్ వచ్చేవారు రెండు డోసుల టీకా వేసుకోకపోతే తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రం చూపించాలని స్పష్టం చేసింది.
వర్చువల్ ర్యాలీలకు సిద్ధమవుతోన్న కాంగ్రెస్
మరోవైపు కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అన్ని ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయ ప్రచారాలపై హస్తం పార్టీ దృష్టిపెట్టింది. త్వరలోనే కాంగ్రెస్.. యూపీలో వర్చువల్ ర్యాలీలను ప్రారంభించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి:భాజపా ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు.. ఏమైందంటే?