five Police man Acquitted After 37 Years : రెండు రూపాయలను అక్రమంగా వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసులు.. 37 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నిర్దోషులుగా తేలారు. సరైన సాక్షాధారాలు లేని కారణంగా ఆ ఐదుగురిని నిరపరాధులుగా ప్రకటించింది కోర్టు. 1986లో జరిగిన ఘటనపై.. బిహార్‌లోని ఓ కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. వాహనదారుల నుంచి పోలీసులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుండగా.. అప్పటి బెగుసరాయ్ జిల్లా ఎస్పీ వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి రామరతన్ శర్మ, కైలాష్ శర్మ, జ్ఞాని శంకర్, యుగేశ్వర్ మహ్తో, రామ్ బాలక్ రాయ్ అనే ఐదుగురు పోలీసులపై ముఫాసిల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం భాగల్పుర్ విజిలెన్స్ కోర్టులో పలు దఫాలుగా విచారణ జరిగింది. పోలీసులు నేరం చేశారనే ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేని కారణంగా కోర్టు ఈ కేసును కొట్టివేసింది.
ఆ రోజు ఏం జరిగింది..
1986 జూన్ 10న.. రాత్రి సమయంలో భాగల్పుర్ పరిధిలో ఓ చెక్‌పోస్ట్ ఐదుగురు పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. అటుగా వెళ్లే వాహనదారుల నుంచి 2 రూపాయలను అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై అప్పటి బెగుసరాయ్ ఎస్పీ అరవింద్ వర్మకు ఫిర్యాదు అందింది. ఆ పోలీసులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించిన ఎస్పీ.. అందుకు ఓ ప్రణాళిక రూపొందించారు.
చెక్‌పోస్ట్ వైపుగా వెళుతున్న ఓ వాహనాన్ని ఆపిన ఎస్పీ.. రెండు రూపాయల నోటుపై సంతకం చేసి దాన్ని డ్రైవర్‌కు ఇచ్చారు. పోలీసులు లంచం అడిగితే.. ఆ నోటును వారికి ఇవ్వమన్నారు. అనంతరం వాహనం చెక్‌పోస్ట్ వద్దకు వెళ్లగానే.. డ్రైవర్ నుంచి రూ.2 డిమాండ్ చేశారు పోలీసులు. దీంతో ఎస్పీ సంతకం చేసిచ్చిన ఆ నోటును ఓ కానిస్టేబుల్‌కు ఇచ్చాడు డ్రైవర్. అనంతరం తిరిగొచ్చి మొత్తం విషయాన్ని ఎస్పీకి తెలియజేశాడు. వెంటనే చెక్వద్ద వద్దకు వెళ్లిన ఎస్పీ.. ఓ జవాన్ జేబులో నుంచి తాను సంతకం చేసిచ్చిన రెండు రూపాయల నోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఐదుగురుపోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా స్థానిక సీఐను ఆదేశించారు.