Accidents in India: రాజస్థాన్ జైపుర్ జిల్లాలోని షాపురా ప్రాంతంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో నలుగురు పోలీసులు ఉన్నారు.
దిల్లీ నుంచి గుజరాత్‌కు నిందితుడిని తరలిస్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. నలుగురు మృతి
ముంబయి- పుణె ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా, ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఖండలా ఘాట్ సమీపంలో ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో రెండు భారీ కంటైనర్స్ సహా మెుత్తం ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ వాహనాలన్నీ ముంబయి వైపుగా ప్రయాణిస్తున్నాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం, ఖోపోలి పోలీసులు హుటాహూటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించారు.
భారీ వాహనాల మధ్య ఇరుక్కున్న కారు క్షతగాత్రులను రక్షిస్తున్న రెస్క్యూ టీం సింధ్ నదిలోకి కార్మికుల వాహనం- నలుగురి దుర్మరణం
మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో కార్మికులు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి సింధ్ నదిలో పడిపోయింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందగా, 15 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వీరందరినీ బంగాల్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. జిల్లాలోని విర గ్రామంలో వంతెన నిర్మాణం కోసం వచ్చిన కూలీలని పోలీసులు తెలిపారు. జిల్లాలోని కొలరస్ పోలీస్ స్టేషన్ పరిధి హిరపుర్ గ్రామానికి సమీపంలో ఉదయం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడం వల్ల సింధ్ నదిలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. వీరంతా సోమవారం రాత్రి రైలులో ఝాన్సీకి చేరుకున్నారని.. అక్కడి నుంచి పడొర గ్రామానికి బస్సులో వచ్చారని పోలీసులు చెప్పారు. వంతెన నిర్మాణమయ్యే ప్రదేశానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.
మృతిచెందిన వారిలో ముగ్గురిని హమీద్ మహ్మద్ అబ్దుల్లా, ఖాహుల్ అమీన్, హకీమ్ ముస్తాఫాగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
అయ్యప్ప దర్శనానికి వెళుతూ..
కర్ణాటక నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం ట్రక్కును ఢీ కొట్టింది. మంగళవారం ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
యాత్రికులు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ నిద్రలోకి జారిపోవడం వల్లే ట్రక్కును ఢీ కొట్టిందని ఎలాతుర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరో ఇద్దరు మృతిచెందారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఇది చదవండి:'విజయం పక్కా మాదే- యోగికి ఇంటిదారి చూపిస్తాం'