వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడనే కోపంతో అడ్మిన్‌ను చితకబాది, నాలుకను కోసేశారు ఐదుగురు వ్యక్తులు. మహారాష్ట్ర పుణెలో డిసెంబర్ 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన అతడి నాలుకకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసు వివరాల ప్రకారం..పుణె నగరంలోని ఫుర్సుంగిలోని ఓ హౌసింగ్ సొసైటీలో బాధితుడు(గ్రూప్ అడ్మిన్), నిందితులు నివసిస్తుంటారు. బాధితుడు హౌసింగ్ సొసైటీ సమాచారం కోసం 'ఓం హైట్స్ ఆపరేషన్' పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అందులో ఆ సొసైటీ సభ్యులందరూ ఉన్నారు. అయితే గ్రూప్ నుంచి ఇటీవల ఓ వ్యక్తిని తొలగించాడు. దీనిపై అతడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రూప్ అడ్మిన్‌కు మెసేజ్ చేశారు. గ్రూప్ నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించాడు.
అడ్మిన్ స్పందించకపోవడం వల్ల నిందితుడు అతడికి ఫోన్ చేసి కలవాలనుకుంటున్నానని చెప్పాడు. మరో నలుగురితో కలిసి అడ్మిన్ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అందరూ కలిసి అతడ్ని ముఖంగా తీవ్రంగా కొట్టారు. నాలుక కోశారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. నాలుకకు కుట్లు వేయించారు. అడ్మిన్ భార్య ఆ నిందితులపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
12 ఏళ్ల చిన్నారిపై 58 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో 12 ఏళ్ల బాలికపై 58 ఏళ్ల పిండి మిల్లు యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం గురించి చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసి బాధితురాలి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహంతో నిందితుడి ఇంటికి వెళ్లి అతడి కారు, మోటార్ సైకిల్‌ను తగలబెట్టారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడిపై పోక్సో సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.