Children Drowned In Pond : బిహార్‌లోని కైమూర్ జిల్లాలో నీటి మునిగి ఐదుగురు చిన్నారులు మరణించారు. ధౌపోఖర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. చిన్నారులు స్నానానికి వెళ్లి చనిపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను అన్నుప్రియ(12), అన్షు ప్రియ(10), అపూర్వ ప్రియ(9), మధుప్రియ(8), అమన్ కుమార్(11)గా గుర్తించారు.
చెరువులో నుంచి చిన్నారుల మృతదేహాలను వెలికితీసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లలంతా చెరువులో స్నానం చేస్తుండగా నీట మునిగి చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
సీఎం సంతాపం.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా
ఐదుగురు చిన్నారులు నీట మునిగి మృతి చెందిన ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ స్పందించారు. మరణించిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
పిక్నిక్కు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
దీపావళి పండుగ వేళ.. వనభోజనానికి వెళ్లిన ఇద్దరు యువకులు చనిపోయారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఘటన జరిగింది. రాజ్‌కోట్‌కు చెందిన నాలుగు కుటుంబాలు.. తమ పిల్లలతో స్థానికంగా ఉన్న డెరోయ్ గ్రామంలో వనభోజనానికి వెళ్లారు. అందరూ సొరథియా సరస్సు ఒడ్డున అల్పాహారం చేశారు. అనంతరం చేతులు కడుక్కోవడానికి సరస్సు వద్దకు వెళ్లారు.
ఆ సమయంలో నీలేశ్ అనే యువకుడు చేతులు కడుక్కుంటూ ఒక్కసారిగా సరస్సులో మునిగిపోయాడు. వెంటనే అతడిని కాపాడేందుకు దర్శిత్ అనే యువకుడు నీటిలో దూకాడు. కానీ అతడు కూడా మునిగిపోయాడు. వారిద్దరినీ చూసిన నందన్ సరస్సులోకి దూకి నీలేశ్, దర్శిత్‌ను బయటకు లాక్కొచ్చాడు. అప్పటికే వారిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరూ మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు.