Pulasa fishing: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మాంసాహార ప్రియులు ఏడాది కాలం పాటు ఎదురుచూసే రోజులు రానే వచ్చాయి. సాధారణంగా వరదలు అంటేనే గోదావరిపరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతుంటారు. కానీ, వరదల సమయంలో వచ్చే పులస చేప కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లాం పుస్తెలు అమ్మి అయినా సరే.. పులస కూర తినాలనేది గోదావరి జిల్లాల్లో దశాబ్దాల కాలంగా ఓ నానుడి.. అరుదుగా.. ఒకటీ రెండు లభించే ఈ జాతి చేపల కోసం మాంసాహార ప్రియులు వెంపర్లాడుతుంటారు. మత్స్యకారుల వద్ద పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లోని తమ బంధువులకు బహుమతిగా పంపుతుంటారు.
కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం చేరువలో ప్రవహించే గౌతమి.. గోదావరి నదికి వరద నీరు తాకింది. బాలయోగి వారధి వద్ద ప్రవాహం పరవళ్లు తొక్కుతూ సముద్రం వైపు పోతుంది.. ధవళేశ్వరం గ్యారేజీ నుంచి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలడంతో సముద్ర జలాలలో ఇలసగా ఉండే ఈ చేప ఎర్రనీటికి ఎదురీదుకుంటూ కోటిపల్లి వరకు వస్తుంటాయి. ఎర్రమట్టి.. నీరు తాగడంతో ఇలస చేప కాస్త పులసగా మారుతుంది. యానం వద్ద గోదావరి పాయల్లో మత్స్యకారులు ఏర్పాటు చేసే ప్రత్యేక వలలలో ఈ చేపలు చిక్కుకుంటాయి. ఈ చేపల రుచి అమోఘంగా ఉండడంతో ధర కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. కిలో చేప రూ.5వేల నుంచి 7వేల దాకా వేలం పాటల్లో పాడుకొని కొనుగోలుదారులకు పదివేలకు అమ్ముతుంటారు. రెండు కిలోల బరువుండే చేప రూ.15వేల ధర పలికిందంటే ఈ చేపకు ఉన్న రేంజ్ అలాంటిది. మార్కెట్లకు ఎక్కువ చేపలు వస్తే ధర తక్కువగా.. తక్కువ చేపలు వస్తే ధర ఎక్కువగా పలుకుతుంది. ఈ సీజన్లో రోజూ వేటకు వెళ్లే మత్స్యకారుల వలలకు ఒక్క పులస పడినా వారి పంట పండినట్టే.