ఆమె అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కేవలం మగవారికే పరిమితం అనుకున్న భారీ వాహనాలను నడుపుతూ ఔరా అనిపిస్తోంది. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమె.. కేవలం వంటింటికే పరిమితమనుకుంది. భర్త ఆకస్మిక మరణంతో పిల్లల బరువు బాధ్యత మీద పడింది. ఆ కష్టమే నేడు ఆమెను ఆదర్శ మహిళగా నిలిపింది. తన పిల్లలను అన్నీ తానై చూసుకుంది. కేవలం మగవారే డ్రైవింగ్ చేస్తారనే.. అపోహను తన విజయంతో చెరిపేసింది. అనేక పోరాటాలను అధిగమించిన ప్రియాంక శర్మ.. రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా రికార్డు సృష్టించింది.
భర్త మరణంతో ఒంటరై.. కష్టపడి బస్సు డ్రైవరై.. ఆదర్శంగా ప్రియాంక ప్రయాణం! - ప్రయాంక శర్మ లేడీ డ్రైవర్
కష్టపడి పనిచేస్తే సాధించనిదంటూ ఏదీ ఉండదు అనే దానికి ఈమె నిదర్శనం. అందరిలా కాకుండా భిన్నమైన రంగంలోకి వెళ్లి దానిలో విజయం సాధించింది ఆ మహిళ. సాధారణంగా ఆడవాళ్లు కార్లు, ఆటోలు, బైక్‌లు నడపడం చూస్తుంటాం. కానీ ఈ మహిళ మాత్రం ఏకంగా బస్సు నడిపేస్తున్నారు. అంతేకాదు, ఏకంగా ఆర్టీసీలో డ్రైవర్‌గా ఉద్యోగం సంపాదించారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నియమించిన 26 మంది మహిళా డ్రైవర్లలో.. అనేక పోరాటాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటి మహిళా ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా ఎంపికైంది లఖ్‌నవూకు చెందిన ప్రియాంక శర్మ. వివాహం తర్వాత తన భర్త మద్యపానానికి అలవాటు పడి అనారోగ్యం పాలయ్యాడు. కొద్దిరోజులకే అతడు మరణించడం వల్ల జీవితం కష్టంగా మారిపోయింది. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలున్నారు. వారి బాధ్యత అంతా తన మీద పడడం వల్ల కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట ఒక ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌లో హెల్పర్‌గా చేరిన ప్రియాంక.. అక్కడే డ్రైవింగ్ నేర్చుకుంది. తర్వాత ఉద్యోగ రీత్యా ముంబయికి మారింది. ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌లో డ్రైవర్‌గా చేరి బంగాల్, అసోం లాంటి పలు రాష్ట్రాలకు వెళ్లింది. మహిళా డ్రైవర్లకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపింది.
"భర్త చనిపోవడం వల్ల కుటుంబ బాధ్యతలన్నీ నా మీదే పడ్డాయి. పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉండడం వల్ల ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌లో సహాయకురాలిగా పని చేశాను. ఆ సమయంలోనే డ్రైవింగ్ నేర్చుకున్నాను. 2020లో ప్రభుత్వం మహిళా డ్రైవర్ల కోసం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల దానికి దరఖాస్తు చేసుకున్నాను. సెలెక్ట్ అయిన తర్వాత 2022 మేలో శిక్షణ పొంది సెప్టెంబర్‌లో పోస్టింగ్ పొందాను. మాకు వచ్చే జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ సంస్థ అధికారుల నుంచి నాకు మంచి సహకారం లభిస్తోంది."- ప్రియాంక శర్మ