గడ్డకట్టించే చలి.. సముద్ర మట్టానికి 15వేల అడుగుల ఎత్తు.. ఊపిరి పీల్చుకోవడమే కష్టమనిపించే వాతావరణం.. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు భారత వీరనారి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రమైన సియాచిన్‌లో విధులు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా రికార్డు కెక్కారు కెప్టెన్ శివ చౌహాన్. ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్కు చెందిన కెప్టెన్ శివ చౌహాన్.. సియాచిన్ హిమానీనదంలోని కుమార్ పోస్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. శివ చౌహాన్ నియామకంపై ఈమేరకు ప్రకటన చేసిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్.. ట్విట్టర్లో ఫొటోలు విడుదల చేసింది.
ఎత్తైన యుద్ధక్షేత్రంలో దేశానికి రక్షణగా 'వీరనారి'.. తొలి మహిళగా రికార్డ్ - సియాచిన్ ఆర్మీ అధికారిణి
సియాచిన్‌లో పోస్టింగ్ సాధించిన తొలి మహిళా సైనికాధికారిగా కెప్టెన్ శివ చౌహాన్ రికార్డుకెక్కారు. సియాచిన్లోని కుమార్ పోస్టులో ఈ వీరనారి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఫొటోలు విడుదల చేసింది.
సియాచిన్‌లో 15,632 అడుగుల ఎత్తులో కుమార్ పోస్టు ఉంది. ప్రాణాలను హరించే చల్లటి గాలులు, ఊపిరి కూడా సరిగా తీసుకునే అవకాశం లేని పరిస్థితులు ఇక్కడ ఏడాదంతా ఉంటాయి. అడుగుతీసి అడుగు పెడితే.. మంచులో ఎక్కడ కూరుకుపోతామనే భయం ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో.. పురుషులకు దీటుగా పనిచేసేందుకు సిద్ధమయ్యారు శివ చౌహాన్. అయితే, ఇక్కడ పోస్టింగ్ లభించడం.. సులభంగా ఏమీ జరిగిపోలేదు. అత్యంత కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాతే.. కెప్టెన్ శివ చౌహాన్‌ను ఇక్కడ నియమించారు ఆర్మీ ఉన్నతాధికారులు. 'అన్ని అడ్డంకులను బద్దలుకొడదాం' అనే క్యాప్షన్‌తో శివ చౌహాన్ ఫొటోలను ట్వీట్ చేసింది ఆర్మీ.
హిమాలయాల్లోని తూర్పు కారకోరం పర్వతశ్రేణిలో సియాచిన్ హిమానీనదం ఉంది. భారత్-పాకిస్థాన్ మధ్య నియంత్రణ రేఖ ఈ ప్రాంతం వద్దే ముగుస్తుంది. లద్దాఖ్‌లో ఉన్న ఈ ప్రాంతంలోనే 1984లో దాయాది పాక్‌తో యుద్ధం జరిగింది. ప్రస్తుతం సియాచిన్ ప్రాంతమంతా భారత్ అధీనంలోనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఇదే.