గగన్‌యాన్‌లో భాగంగా ముందుగా అనుకున్నట్లు మానవ రహిత అంతరిక్ష యాత్రను ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టడం సాధ్యం కాదని ఇస్రో ఛైర్మన్ కే శివన్ అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మిషన్‌ను వచ్చే ఏడాది(2022) ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కరోనా సంక్షోభం కారణంగా తలెత్తిన పరిస్థితుల వల్లే ఈ ప్రయోగం ఆలస్యమవుతున్నట్లు చెప్పారు.
బెంగళూరు కేంద్రంగా ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. ఈ ఏడాది డిసెంబర్లో మొట్ట మొదటి మానవ రహిత అంతరిక్ష యాత్రను చేపట్టాలని భావించింది. అయితే కరోనా ప్రభావం పరిశ్రమలపై తీవ్రంగా పడటం వల్ల ఈ మిషన్‌కు అవసరమైన హార్డవేర్ సరఫరా నిలిచిపోయిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. అందుకే ఈ ప్రయోగం వాయిదా వేయడం అనివార్యమైందని పేర్కొన్నాయి.
మూడేళ్ల క్రితం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మానవ సహిత గగన్‌యాన్ మిషన్‌ను ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం 2022 నాటికి అంతరిక్షంలోకి ముగ్గురు వ్యోమగాములను సుమారు 5-7 రోజుల పాటు పంపాలని గగన్‌యాన్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. దాని ప్రకారమే ఇస్రో ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ముందుగా రెండు మానవ రహిత మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. తొలి మానవ రహిత మిషన్ 2020 డిసెంబర్, రెండోది 2021 జూన్‌లో చేపట్టాలని అనుకున్నారు. మరో ఆరు నెలల అనంతరం తుది మిషన్ మానవ సహిత గగన్‌యాన్‌ను 2021, డిసెంబర్లో చేపట్టేందుకు ప్రణాళిక రచించారు. అయితే కరోనా కారణంగా ఇవన్నీ అనుకున్నట్లు జరగలేదు.
ఇదీ చూడండి: కర్ణాటకలో సీఎం మార్పు- అసలు కారణమిదే...