కేరళలో తొలిసారి ఓ ట్రాన్స్జెండర్ ఎన్నికల బరిలోకి దిగారు. మలప్పురానికి చెందిన అనన్య కుమారి అలెక్స్.. వెంగర నియోజకవర్గం నుంచి డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
అనన్య నామపత్రాలను రిటర్నింగ్ అధికారి సమీక్షించి ఆమోదించారు. దీంతో కేరళ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారి ఓ ట్రాన్స్జెండర్ ఎన్నికల అభ్యర్థిగా నిలిచినట్లైంది.
ఎన్నికల్లో గెలుపోటములతో తనకు సంబంధం లేదని చెబుతున్నారు అనన్య. తమ వర్గానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.
"ప్రపంచంలో ఏదో ఓ మూల, ఎవరికీ తెలియకుండా జీవించడం నా ఉద్దేశం కాదు. నేను ఈ ప్రపంచంలో బతికానని అందరికీ తెలియాలి. నిరంతరం పోరాడి.. ఇతరులకు విజయం అందించేందుకు కృషి చేస్తా. ప్రజలకు ప్రతినిధిగా ఉండాలనుకోవడమే నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం. నేను గెలిస్తే.. సమాజంలో అణగారిన వర్గాల ఉన్నతి కోసం పనిచేస్తా."