First Post Office In India : ఒకప్పుడు దేశంలో చిట్టచివరి పోస్టాఫీస్ అది. అక్కడ ఉత్తరాలు పంపిణీ చేయడం, సేకరించడమూ ప్రమాదకరంగా ఉండేది. కానీ భారత ఆర్మీ రాకతో అక్కడి పరిస్థితి మారిపోయింది. అలాంటి పోస్టాఫీస్ ఇప్పుడు కొత్త గుర్తింపును పొందింది. అది భారత సైన్యం వల్లే సాధ్యమైంది. అదే జమ్ముకశ్మీర్.. కుప్వారా జిల్లాలోని కిషన్‌గంగా నది ఒడ్డున ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్‌ఓసీ)- కెరాన్ పోస్టాఫీస్. ఆ పోస్టాఫీస్ పిన్ కోడ్ నంబర్ 193224. ఇంతకీ ఆ పోస్టాఫీస్‌కు ఏం గుర్తింపు వచ్చింది? ఆర్మీతో ఏం చేసిందో తెలుసుకుందామా మరి.
ఆర్మీ రాకతో పరిస్థితి మార్పు..
India First Post Office : కెరాన్ పోస్టాఫీస్‌ను దేశంలోని చివరిదిగా భావించేవారని బారాముల్లా డివిజన్ పోస్టాఫీస్ సూపరిండెంట్ అబ్దుల్ హమీద్ కుమార్ తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు పక్కనే ఉండటం వల్ల ఇక్కడ పరిస్థితులు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండేవని చెప్పారు. తాము ఉత్తరాలను సరిగ్గా బట్వాడా చేయలేకపోయేవాళ్లమని.. కానీ ఇండియన్ ఆర్మీ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఇప్పుడు ఎల్‌ఓసీ నుంచి దేశంలోనే మొదటి పోస్టాఫీస్‌గా కెరాన్ పోస్టాఫీసే నిలిచిందని అబ్దుల్ తెలిపారు.
స్వాతంత్ర్యానికి ముందు నుంచే..
ఇండియా-పాకిస్థాన్ విభజనకు ముందు నుంచే కెరాన్ పోస్టాఫీస్లోకార్యకలాపాలు జరిగేవని స్థానికులు అంటున్నారు. 1965, 1971లో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు.. అలాగే 1990లో పాక్ మద్దతుతో ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచి ఉత్తరాల పంపిణీ జరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం కెరాన్ పోస్టాఫీస్‌లో ముగ్గురు పోస్ట్‌మన్‌లు ఉన్నారు. ఈ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ ఉండదు. అందువల్ల డిజిటల్ సేవలు ఇక్కడ అందుబాటులో లేవని పోస్ట్‌మాస్టర్ షాకిర్ భట్ తెలిపారు.
"1992లో నేను కెరాన్ పోస్టాఫీస్‌లో పోస్ట్‌మన్‌గా జాయిన్ అయ్యాను. 1993లో ఈ ప్రాంతంలో సంభవించిన వరదల్లో పోస్టాఫీస్ పూర్తిగా కొట్టుకు పోయింది. అప్పటి నుంచి మా ఇంట్లోనే పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేశాం. ముగ్గురు పోస్ట్‌మన్‌లు స్థానికులతో పాటు, ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బందికి ఉత్తరాలు డెలివరీ చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు మెరుగయ్యాయి. ఈ ప్రాంతానికి అప్పుడప్పుడు పర్యటకులు వస్తున్నారు. ఈ పోస్టాఫీస్ పర్యటకులను ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు చివరి పోస్టాఫీస్‌గా ఉన్నది కాస్తా ఇప్పుడు దేశంలోనే మొదటి పోస్టాఫీస్‌గా మారింది"