తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా 'మిషన్​ 100+' లక్ష్యంలో తొలి విడతే కీలకం - పౌరసత్వ చట్టం

ఈశాన్య రాష్ట్రమైన అసోంలో రెండోసారి అధికార పీఠం దక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు మిషన్‌ వందకుపైగా స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈనెల 27న 47 స్థానాలకు జరిగే తొలిదశ పోలింగ్‌లో గణనీయ సంఖ్యలో స్థానాలు సాధించకుంటే అధికార కూటమి ఆశలు అడియాశలయ్యే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్​ఆర్​సీ అమలుకు కట్టుబడి ఉన్నట్లు భాజపా ప్రకటించటం.. అధికార కూటమిని దెబ్బతీసే సూచనలున్నాయి. మరోవైపు.. ప్రతిపక్షాలు మాత్రం సీఏఏపై వ్యతిరేకతే ప్రధాన అజెండాగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

First phase of polls more crucial for BJP's Mission 100+ in Assam
భాజపా 'మిషన్​ 100+' లక్ష్యంలో తొలి విడతే కీలకం

By

Published : Mar 25, 2021, 6:33 AM IST

2016లో అనూహ్యంగా అసోంలో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి మళ్లీ గద్దెనెక్కేందుకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకువెళ్తోంది. భాజపా కూటమి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. ఈనెల 27న 47 స్థానాలకు జరిగే తొలిదశ ఎన్నికలు కీలకంగా మారాయి.

తొలి విడతలో కమలం పార్టీ, దాని మిత్రపక్షాలు.. 2016లో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తేనే, మళ్లీ అధికారం చేపట్టాలన్న కల సాకారమవుతుందని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అసోం గణపరిషత్‌ (ఏజీపీ), యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌(యూపీపీఎల్​), గణ సురక్ష పార్టీ(జీఎస్​పీ)తో కలిసి పోటీ చేస్తోంది.

'మిషన్​వంద ప్లస్​' లక్ష్యంతో..

అసోంలో మొత్తం 126 శాసనసభ స్థానాలు ఉండగా కమలం పార్టీ కూటమి 'మిషన్‌వంద'కుపైగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత ఎన్నికల్లో 86 స్థానాలు గెలుపొందిన అధికార కూటమి అసోంలో తొలిసారి కాషాయ జెండా ఎగురవేసింది. ఇప్పుడు 'మిషన్​ 100 ప్లస్​' లక్ష్య సాధన సాకారం కావాలంటే ఈసారి 14కుపైగా ఎక్కువ స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం.. భాజపా కూటమికి అంత సానుకూల వాతావరణం కనిపించటం లేదు.

అసోంలో ఈనెల 27న 47 స్థానాల్లో తొలిదశ పోలింగ్‌ జరగనుండగా.. 2016లో జరిగిన ఎన్నికల్లో భాజపా 28 స్థానాలు, ఆ పార్టీ మిత్రపక్షాలు 8 నియోజకవర్గాల్లో గెలుపొందాయి. ఈ 47 స్థానాల్లో ప్రతిపక్షం విషయానికొస్తే కాంగ్రెస్‌ 9 చోట్ల, ఆలిండియా యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌(ఏఐయూడీఎఫ్​) 2 స్థానాలు గెలుపొందాయి. భాజపా కూటమి అసోంలో అధికారం నిలబెట్టుకోవటానికి '100 ప్లస్​' లక్ష్యాన్ని చేరుకోవాలంటే, గతంలో ఉన్న స్థానాలతోపాటు అదనంగా మరికొన్ని సీట్లు గెలవాల్సి ఉంటుంది.

2, 3 విడతల్లో కష్టమేనా..?

అసోంలో రెండు, మూడు విడతల ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి పరిస్థితి.. భాజపా, దాని మిత్రపక్షాల కంటే కాస్త మెరుగ్గా ఉన్నట్లు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. 2016 ఎన్నికల్లో భాజపా, దాని మిత్రపక్షాలు.. ఈసారి రెండు, మూడు విడతల పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో కొన్ని స్థానాలు గెలిచాయి.

ఇవీ చదవండి:'టీ పరిశ్రమను నాశనం చేసే వారితో కాంగ్రెస్​ జట్టు'

అసోం సీఎం ఎంపికకు భాజపా 'ఎంపీ​' ఫార్ములా!

'మేం అధికారంలోకి వస్తే సీఏఏ మూలకే'

మైనార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ స్థానాల్లో ప్రస్తుతం అధికార కూటమికి అనుకూల పరిస్థితులు కనిపించటం లేదు. రాజకీయ సమీకరణాలు మారటం కూడా.. భాజపా కూటమికి ప్రతికూలంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌.. ఏఐయూడీఎఫ్, లెఫ్ట్​ సహా ఇతర పార్టీలతో కలిసి బరిలోకి దిగుతోంది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్​ఆర్​సీ అమలుకు కట్టుబడి ఉన్నట్లు భాజపా ప్రకటించటం కూడా అధికార కూటమికి దెబ్బతగిలే సూచనలున్నాయి.

ఇదీ చూడండి: 'సకాలంలో సీసీఏ- కాంగ్రెస్​ హామీ అవివేకం'

సీఏఏనే ప్రధాన అజెండా..

రెండు, మూడు విడతల ఎన్నికలు జరిగే స్థానాల్లో.. కొత్తగా ఏర్పాటైన రెండు ప్రాంతీయ పార్టీలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఈ పార్టీలు సీఏఏను ప్రధాన అజెండాగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'సీఏఏ, భాజపాను ఓడించాలనేదే ప్రజల కోరిక'

తొలి విడత తప్ప రెండు, మూడు విడతల పోలింగ్​ జరిగే కొన్ని నియోజకవర్గాల్లో.. కాంగ్రెస్‌, ఏఐయూడీఎఫ్​.. భాజపా, దాని మిత్రపక్షాల గెలుపు అవకాశాలను దెబ్బతీసే సూచనలు కనిపిస్తున్నాయి. కటిగోరా, బోర్ఖాల, తూర్పు బిలాసిపారా, ఉదర్‌బంద్‌, మంగళ్‌దాయ్‌, బోర్‌ఖేత్రి, సర్‌బోగ్‌, సోనయి, పతర్‌కండి, గోలక్‌గంజ్‌ స్థానాల్లో ప్రతిపక్ష కూటమిది పైచేయిగా కనిపిస్తోంది.

ఈ స్థానాల్లో భాజపా కూటమి.. ఎక్కువ స్థానాలు సాధించకుంటే తొలిదశలో జరిగే 47 సీట్లలో 2016 కంటే మరిన్ని ఎక్కువ సీట్లు గెలుపొందాల్సి ఉంటుంది. లేకుంటే 'మిషన్‌వంద'కుపైగా సీట్ల లక్ష్యాన్నే కాదు అధికారం కూడా వదులుకోవాల్సి ఉంటుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

- గౌతమ్​ బారువా, ఈటీవీ భారత్​

ABOUT THE AUTHOR

...view details