India Mediation Day program in Hyderabad: న్యాయస్థానంలో కేసు పరిష్కారం కోసం భారీగా డబ్బులతో పాటు.. ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోందంటూ ప్రజల్లో ఉన్న భావన తొలగించాల్సిన అవసరం ఉందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మధ్యవర్తిత్వమే ఇందుకు సరైన పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన తొలి 'ఇండియా మీడియేషన్ డే'లో మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ.. సమస్యకు సత్వర పరిష్కారంతోనే సమాజంతో పాటు దేశాభివృద్ధి సాధ్యమని చెప్పడంలో సందేహం లేదని చెప్పారు.
"హైదరాబాద్‌లో మీడియేషన్ కేంద్రం ఏర్పాటులో నాకు భాగస్వామ్యం ఉన్నందుకు ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లో మీడియేషన్ కేంద్రం ఏర్పాటుపై నేను, జస్టిస్ లావు నాగేశ్వరావు ఎన్నోసార్లు చర్చించుకున్నాం. హైదరాబాద్ మీడియేషన్ కేంద్రం ఏర్పాటు వెనుక జస్టిస్ లావు నాగేశ్వరరావు కృషి ఎంతో ఉంది".- జస్టిస్ ఎన్వీ రమణ
న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం కీలకమైన అంశమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం ప్రధాన పాత్ర వహిస్తోందన్న జస్టిస్ హిమాకోహ్లీ.. మధ్యవర్తిత్వం కోసం న్యాయవాదులకు శిక్షణ అవసరమని తెలిపారు. ప్రజలు కోర్టు కేసులపై వెచ్చించే వ్యయ ప్రయాసలను మధ్యవర్తిత్వ కేంద్రాలు తగ్గిస్తాయన్నారు. మధ్యవర్తిత్వంలో అంతర్జాతీయంగా వస్తున్న మంచి విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని జస్టిస్ హిమాకోహ్లీ పేర్కొన్నారు. దిల్లీ హైకోర్టు మధ్యవర్తిత్వం కోసం 'సమాధాన్' పేరిట వేదికను అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు.
"న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం ఓ కీలకమైన అంశం. చోళుల కాలంలోనూ మధ్యవర్తిత్వం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆధునిక కాలంలో కొందరు మీడియేషన్‌ను మెడిటేషన్‌గా కూడా పొరపడుతున్నారు. మధ్యవర్తులు పరిష్కారం కోసం పార్టీలను ఒత్తిడి చేయరు. మధ్యవర్తులు సమస్య పరిష్కారం కోసం తగిన వాతావరణం ఏర్పాటు చేస్తారు".-జస్టిస్ హిమాకోహ్లి,సుప్రీంకోర్టు న్యాయమూర్తి