First Hydrogen Car In India: ప్రస్తుతం విరివిగా వాడుతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. వనరులు తరిగిపోవడం, పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌తోపాటు ఎలక్ట్రిక్ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఇంధన వినియోగంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తొలి హైడ్రోజన్ కారు అందుబాటులోకి వచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కారు పనితీరును కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆయన నివాసం నుంచి పార్లమెంటు వరకు హైడ్రోజన్ కారులో ప్రయాణించారు.
పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఇంధన వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తొలి హైడ్రోజన్ కారును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలోనే విడుదల చేశారు. సమర్థవంతమైన, పర్యావరణ రహిత, స్వయం ఆధారిత ఇంధన మార్గంలో భారత్ పయనించేందుకు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. జపాన్ సంస్థ టయోటా అందించిన ఈ కారును.. పైలట్ ప్రాజెక్ట్ కింద తానే మొదటగా వినియోగిస్తానని అప్పట్లో వెల్లడించారు. తద్వారా ప్రజలను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. ఆ ప్రకారమే నేడు దిల్లీ రోడ్లపై తొలి హైడ్రోజన్ కారులో కేంద్రమంత్రి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో స్పందించిన ఆయన. భారత్ త్వరలోనే గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి చేసే దేశంగా మారనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, క్లీన్ ఎనర్జీకి అనుగుణంగా 'నేషనల్ హైడ్రోజన్ మిషన్' కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన, గ్రీన్ ఎనర్జీని అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు.