కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా గత ఏడాది భారత్‌లో విధించిన తొలి లాక్‌డౌన్ ఫలితంగా వాయు నాణ్యత పెరిగినట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా తగ్గినట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్విరాన్‌మెంట్ రీసెర్చి జర్నల్‌లో అధ్యయన విశేషాలు ప్రచురితమయ్యాయి.
లాక్‌డౌన్‌తో కీలకమైన వాతావరణ ప్రయోజనాలు చేకూరినట్లు అధ్యయనంలో తేలింది. లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా భూ, వాయుమార్గాల్లో రవాణా గణనీయంగా తగ్గడం, పారిశ్రామిక కార్యకలాపాలు ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల వాతావరణం బాగా మెరుగైనట్లు అధ్యయనం వెల్లడించింది. అధ్యయనానికి గాను పరిశోధకులు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పరిధిలోని సెంటినెల్-5పీ, నాసాకు చెందిన మోడీస్ సెన్సర్లు సహా పలు భూ పరిశోధన సెన్సర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని (డేటా) వినియోగించారు. దీనిద్వారా భూ ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ కాలుష్యం వంటివాటిలో మార్పులను అధ్యయనం చేసిన పరిశోధకులు వివరాలను వెల్లడించారు.
"వాతావరణ కాలుష్యం తగ్గడం.. పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ తగ్గుదలను మేం స్పష్టంగా గమనించాం. సుస్థిర పట్టణాభివృద్ధి ప్రణాళికలకు మా పరిశోధనల్లో తేలిన అంశాలు చాలా కీలకంగా నిలుస్తాయి" అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతంప్టన్‌కు చెందిన ప్రొఫెసర్, అధ్యయనకర్తల్లో ఒకరైన జాడు డ్యాష్ తెలిపారు. ఆర్గానిక్ కార్బన్, బ్లాక్ కార్బన్, మినరల్ డస్ట్, సీ సాల్ట్ వంటివి గణనీయంగా తగ్గినట్లు ఝార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వికాస్ పరీడా వెల్లడించారు.
- ప్రధానంగా హైదరాబాద్, దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలపై పరిశోధకులు దృష్టి సారించారు. గత ఏడాది మార్చి నుంచి మే మధ్య లాక్‌డౌన్ సమయంలో పరిస్థితులను విశ్లేషించారు.
- దేశవ్యాప్తంగా నైట్రోజన్ డైఆక్సైడ్ 12 శాతం తగ్గగా పై 6 నగరల్లో అది 31.5% మేర తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో ఏకంగా 40% తగ్గుదల కనిపించింది.
- 2015-2019 మధ్య ఐదేళ్ల సగటుతో పోలిస్తే.. గత ఏడాది విధించిన లాక్‌డౌన్‌తో దేశ ప్రధాన నగరాల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. పగటి వేళ 1 డిగ్రీ, రాత్రి 2 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గడం విశేషం.
- గ్రీన్‌హౌస్ ఉద్గారాల తీవ్రతతో పాటు, నీరు ఆవిరైపోయే పరిస్థితులు తగ్గడం.. వాతావరణ పరిస్థితులు వంటివాటి వల్ల భూ ఉపరిత ఉష్ణోగ్రతలు తగ్గాయి.
ఇదీ చదవండి:జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు ఎప్పుడు?