కరోనాతో సతమతం అవుతున్న భారత్‌కు.. అమెరికా నుంచి ఔషధాలు, ఆక్సిజన్ ఉత్పత్తి ఉపకరణాలు, మెడికల్ పరికరాలతో తొలి విమానం దిల్లీకి చేరుకుంది. మొత్తం 100 మిలియన్ డాలర్ల మేర సాయం చేస్తామన్న అమెరికా.. అత్యవసరంగా భారత్‌కు తొలి విడతగా 17 వందల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 11 వందల ఆక్సిజన్ సిలిండర్లు 20 మంది రోగులకు నిరంతరాయంగా ప్రాణవాయువు సరఫరా చేసే ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు పంపింది.
రోగులకు, ఆరోగ్య సిబ్బందికి రక్షణగా ఎన్95 మాస్కులు, ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టు కిట్‌లతో పాటు కాలిఫోర్నియా రాష్ట్రం ఇచ్చిన 440 ఆక్సిజన్ సిలిండర్లు కూడా భారత్‌కు వచ్చిన విమానంలో ఉన్నాయి. గురువారం.. ప్రపంచంలోని అతిపెద్ద వైమానిక దళ విమానాశ్రయం అయిన.. ట్రవిస్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి తొలి విమానం భారత్‌కు బయలుదేరగా ఈ ఉదయం భారత్‌కు చేరుకుంది. మరో వారం రోజుల పాటు సాయానికి సంబంధించి విమానాలు భారత్‌కు రానున్నట్లు శ్వేతసౌధం తెలిపింది.
యూరోపియన్ యూనియన్..
బ్రిటన్, ఐర్లాండ్ దేశాల నుంచి వైద్య పరికరాలు భారత్‌కు చేరుకున్నాయి. 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 365 వెంటిలేటర్లు ఐర్లాండ్ పంపగా.. యూకే నుంచి ఇవాళ కూడా దేశానికి మరికొన్ని పరికరాలు వచ్చాయి. ప్రస్తుతం శుక్రవారం 280 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు యూకే నుంచి భారత్‌కు చేరాయి.
రొమేనియా పంపిన 80 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 75 ఆక్సిజన్ సిలిండర్లు శుక్రవారం ఉదయం భారత్‌కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.