ఎనిమిది నెలల క్రితం కనిపించకుండా పోయిన యువకుడి కేసును పోలీసులు అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఛేదించారు. నిందితుల తలకు సెన్సార్లు పెట్టి నిజం కక్కించారు. ప్రజలకు న్యాయం అందించాల్సిన న్యాయవాదే తన దగ్గర పనిచేస్తున్న 17 ఏళ్ల యువకుడిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు తేల్చారు. గతేడాది మేలో జరిగిన ఈ సంఘటనలో నిందితులకు బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష నిర్వహించి వాస్తవాలను రాబట్టారు కర్ణాటక పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే..రామనగర జిల్లా కనకపురకు చెందిన శ్రేయస్ అనే 17 ఏళ్ల యువకుడు స్థానికంగా ఉండే క్రిమినల్ లాయర్ కార్యాలయంలో పార్ట్‌టైమ్ జాబ్ చేసేవాడు. రోజులాగే మే19న కూడా పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. కొద్దిసేపటికే ఏదో పని ఉంది వెంటనే ఆఫీసుకు రమ్మని లాయర్ యువకుడికి ఫోన్ చేశాడు. దీంతో తన తల్లి ఆశాతో 'అమ్మా.. త్వరగా వచ్చేస్తాను' అని చెప్పి వెళ్లిపోయాడు శ్రేయస్.
అర్ధరాత్రి దాటినా కుమారుడు ఇంటికి తిరిగి రాకపోయేసరికి తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లాయర్ శంకర్ గౌడ అతడి సహచరుడు అరుణ్‌లపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. శంకర్ గౌడ ఫోన్ కాల్ ఆధారంగా ఇద్దరిపై 377 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నెలలు గడుస్తున్నా నిందితులు నిజం ఒప్పుకోలేదు. చివరకు కోర్టు అనుమతితో వీరికి బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్‌ను నిర్వహించారు పోలీసులు. దీంతో నిజం బయటపడింది. యువకుడికి నిద్రమాత్రలు ఇచ్చి అత్యాచారం చేశామని ఆపై హత్య చేసి దగ్గర్లో ఉన్న కాలువలో పడేశామని నిందితులు నేరాన్ని అంగీకరించారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా ఈ ఛాలెంజింగ్ కేసును ఛేదించటం రాష్ట్రంలో ఇదే మొదటిదని రామనగర ఎస్పీ సంతోష్‌బాబు తెలిపారు.
యువకుడిపై అత్యాచారం చేసిన నిందితుడు శంకర్ గౌడ ఏంటీ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్..?
బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలో ముందుగా నిందితుడి తలకు సెన్సార్‌ను అమరుస్తారు. తర్వాత అతడిని కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి, కేసుకు సంబంధించిన కొన్ని చిత్రాలు, పదాలను చూపిస్తారు. మెదడులోని కదలికలు, ఆలోచనలన తీరును సెన్సార్లు పసిగడతాయి. దీంతో నిందితులు వాస్తవాలు బయటకు చెబుతారు. ఇది నిందితులపై చార్జ్‌షీటు దాఖలు చేయటానికి ఉపయోగపడుతుంది.