పంజాబ్‌లో ఓ సైనిక శిబిరంపై కాల్పులు జరిగాయి. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌పై అగంతుకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. కాల్పులు శబ్దాలు వినిపించగానే స్టేషన్‌లోని క్విక్ రియాక్షన్ బృందాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపాయి. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపింది ఎంతమంది అనేది ఇంకా తెలియలేదని తెలిపారు.
మరోవైపు.. మిలటరీ స్టేషన్‌పై కాల్పులపై ఆర్మీ స్పందించింది. 'ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించాం. ఇంకెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆస్తినష్టం జరగలేదు. ప్రస్తుతం ఘటనాస్థలిలో గాలింపు కొనసాగుతోంది. పంజాబ్ పోలీసులతో కలిసి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నాం. రెండు రోజుల క్రితం ఇన్సాస్ రైఫిల్, 28 తూటాల అదృశ్యమవడంపైనా దృష్టిపెట్టాం' అని ఆర్మీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘటన వివరాలను నివేదించినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
మిలటరీ స్టేషన్ వద్ద దృశ్యాలు కాల్పుల సమాచారం అందగానే పంజాబ్ పోలీసులు మిలిటరీ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే, ఆ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులు తమ అధీనంలోకి తీసుకోవడం వల్ల పోలీసులను లోపలికి అనుమతించలేదని బఠిండా సీనియర్ ఎస్పీ వెల్లడించారు. కాగా.. కాల్పుల ఘటనలో ఉగ్ర కోణం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన వెనుక కొందరు ఆర్మీ సిబ్బంది హస్తం ఉండొచ్చని భావిస్తున్నామని పేర్కొన్నాయి. ఆర్మీ సిబ్బందే పరస్పరం కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో ఒక ఇన్సాస్ రైఫిల్, 28 తూటాలు అదృశ్యమయ్యాయని.. ఈ ఘటనలో వీటిని వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నాయి.
మిలటరీ స్టేషన్ వద్ద దృశ్యాలు ఏప్రిల్ 14న బైశాఖీ పండగ ఉండడం, 'వారీస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ అనుచరుడు పాపల్‌ప్రీత్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో బఠిండాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశామని అడిషనల్ డీజీపీ సురేంద్ర పాల్ సింగ్ తెలిపారు. బఠిండా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సైనిక స్థావరం. ఇక్కడ కీలకమైన 10వ కోర్ కమాండ్‌కు చెందిన దళాలు ఉన్నాయి. జైపుర్ కేంద్రంగా పనిచేసే సౌత్-వెస్ట్రన్ కమాండ్ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తుంది. బఠిండాలో పెద్ద సంఖ్యలో ఆపరేషనల్ ఆర్మీ యూనిట్లు, ఇతర కీలక పరికరాలు ఉన్నాయి.