firefight broke out in Pulivendu of YSR district: వైఎస్సార్ జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పుల మోతలు కలకలం రేపాయి. ఓ ఘర్షణ కారణంగా భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి తుపాకీతో ఇద్దరు వ్యక్తులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దిలీప్, మహబూబ్ బాషా అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటహుటినా పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. మార్గమాధ్యలో దిలీప్ మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన వైఎస్సార్ జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పుల మోతలు ఆ ప్రాంత నివాసులను ఒక్కసారిగా భయాందోళనకు గురి చేశాయి. ఆర్థికలావాదేవీల కారణంగా భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి తన వద్దనున్న తుపాకీతో ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తీసుకెళ్తుండగా దారి మార్గమాధ్యలో దిలీప్ మృతి చెందాడు. భరత్ కుమార్, దిలీప్‌ల మధ్య ఉన్న ఆర్థిక వివాదాలే ఈ ఘటనకు దారి తీశాయని అధికారులు గుర్తించారు.
ఆర్థికలావాదేవీల విషయంలో గతం వారం రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయని.. ఈరోజు పులివెందుల వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మరోసారి భారీ వాగ్వాదం జరిగి ఈ ఘటనకు దారి తీసిందని బాధితులు తెలిపారు. ఆగ్రహంతో రగిలిపోయిన భరత్ కుమార్.. ఇంటికి వెళ్లి తుపాకీని తెచ్చుకొని మరీ.. కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఇద్దరినీ కాల్చిన తర్వాత అక్కడి నుంచి భరత్ కుమార్ యాదవ్ పరారైనట్లు తెలిపారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి గతంలో భరత్ కుమార్‌ను సీబీఐ ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో ఏ-2గా ఉన్న సునీల్ యాదవ్ బంధువే భరత్ కుమార్ యాదవ్ అని సీబీఐ వెల్లడించింది.