Firing in Kolkata: బంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. రద్దీగా ఉండే పార్క్ సర్కస్ ప్రాంతంలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం ముందు ఓ పోలీసు అధికారి.. ఓ మహిళపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం తానూ తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ద్విచక్రవాహనంపై వస్తున్న మహిళకు తుటాలు తగలగా.. అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. కాల్పుల్లో మరణించిన మహిళ, పోలీసు అధికారి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. 'దాదాపు ఐదు నిమిషాల పాటు పలు రౌండ్ల తూటాలు పేలాయి.' అని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. దీంతో హుటాహుటిన భారీగా బలగాలను తరలించారు అధికారులు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి తరలించారు. కాల్పులకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.