Firecracker Shop Blast : బాణసంచా గోదాంలో మంటలు చెలరేగి 13 మంది మరణించిన ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగళూరు-హోసూరు జాతీయ రహదారిపై ఉన్న అనేకల్ తాలుకాలోని అత్తిబెలె గ్రామంలో ఈ ప్రమాదం వెలుగుచూసింది.
ఇదీ జరిగింది..
శనివారం సాయంత్రం 7 గంటలకు అత్తిబెలె గ్రామంలో ఉన్న బాలాజీ క్రాకర్స్‌లో చిన్న మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు వేగంగా వ్యాపించడం వల్ల గోదాం మొత్తం పేలిపోయింది. ప్రమాద సమయంలో గోదాంలో 20 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు తప్పించుకున్నారు. బాణసంచా లోడ్‌ను లారీ నుంచి గోదాంలోకి దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే గోదాం సమీపంలో ఉన్న అనేక వాహనాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
"బాలాజీ క్రాకర్స్ గొడౌన్ వద్ద బాణసంచా లోడ్ దింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు వెంటనే దుకాణం, గోదాం మంటల్లో చిక్కుకున్నాయి. వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. ఫోరెన్సిక్ బృందం సైతం ప్రమాద స్థలాన్ని తనిఖీ చేస్తుంది."
--మల్లిఖార్జున బాలదండి, బెంగళూరు రూరల్ ఎస్పీ