Firecracker Accident In Karnataka : కర్ణాటక-తమిళనాడులో సరిహద్దులో అత్తిబెలె గ్రామంలోని బాణసంచా గోదాంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఆదివారం చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శక్కరపాణి, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రమణ్యంను స్టాలిన్ ఆదేశించారు.
అంతకుముందు శనివారం రాత్రి ఘటనాస్థలాన్ని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ఈ 'అగ్నిప్రమాదం వార్త విని నేను చాలా బాధపడ్డాను.. ఆదివారం ఘటనాస్థలిని పరిశీలిస్తానుట అని సోషల్‌మీడియా వేదిక ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఈ ఘటనపై కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ మీడియాతో మాట్లాడారు. "అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. గోదాంలో 35 మంది పనిచేస్తున్నారు. షాప్ యజమానితోపాటు అతడి కుమారుడిని అరెస్టు చేశాం. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నాం. దర్యాప్తులో అగ్నిప్రమాదానికి అసలు కారణం తెలుస్తుంది" అని చెప్పారు.