Fire In Khajuraho Udaipur Train Today :మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఖజురహో ఉదయ్‌పుర్ ఇంటర్సిటీ ట్రైన్‌కు పెను ప్రమాదం తప్పింది. సితోలి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు చెలరేగడం వల్ల అప్రమత్తమైన పైలట్ రైలును ఆపివేశారు. భయాందోళనకు గరైన ప్రయాణికులు బోగీ దిగి పరుగెత్తారు. "ఇంజిన్‌లో మంటలు చెలరేగగానే.. ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ వ్యవస్థను పూర్తిగా ఆపివేశారు. ఆ తర్వాత రైలును నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గురైన రైలు ఇంజిన్‌ను తొలగించి.. మరొక ఇంజిన్‌తో జత చేసి గమ్యస్థానానికి పంపిస్తాం. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపుతున్నాం." అని ఉత్తర మధ్య రైల్వే సీపీఆర్ఓ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.
"రైలులో మంటలుచెలరేగడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురయ్యాం. రైలును దాదాపు రెండు గంటల పాటు నిలిపివేశారు. ఆ తర్వాత ఇంజిన్‌ను మార్చిన అనంతరం రైలు బయలుదేరుతుంది అని అధికారులు చెబుతున్నారు."
--ప్రయాణికుడు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
Telangana Express Fire Accident Today : మరోవైపు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు సైతం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలో ప్రయాణిస్తున్న ఈ రైల్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఎస్-2 బోగీలో మంటలు చెలరేగడం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నాగ్‌పుర్ సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరిగెత్తారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.