Fire Explosion In Crackers Factory :తమిళనాడు.. విరుధునగర్ జిల్లాలో రెండు వేర్వేరు బాణసంచా ఫ్యాక్టరీల్లో మంగళవారం జరిగిన పేలుడు ఘటనల్లో 14 మంది మృతిచెందారు. శివకాశి సమీపంలోని రంగపాళయం గ్రామంలో ఉన్న ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి 12 మంది మహిళలు సహా 13 మరణించారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. కిచ్చనాయకన్‌పట్టి గ్రామంలోని బాణసంచా కర్మాగారంలో జరిగిన మరో పేలుడులో ఓ వ్యక్తి మృతిచెందాడు. పేలుళ్లపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
బాణసంచా దుకాణానికి నిప్పు..
రంగపాళయం గ్రామంలో ఉన్న కనిష్కర్ బాణసంచా తయారీ కేంద్రంలో 80 మంది పైగా కార్మికులు పనిచేస్తున్నారు. కర్మాగారానికి ఎదురుగా బాణసంచా దుకాణాన్ని యజమానులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం కూలీలు బాణసంచా పరీక్షిస్తుండగా దాని నుంచి నిప్పురవ్వ ఎగిరి.. పక్కనే ప్యాకింగ్ చేస్తున్న బాణసంచాపై పడింది. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మహిళలు సహా 13 మంది మరణించగా.. తీవ్రంగా గాయపడిన ముగ్గురుని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో కొందరిని భాక్యం (35), మహాదేవి (50), పంచవర్ణం (35), బాలమురుగన్ (30), తమిళచెల్వి (55), మునీశ్వరి (32), తంగమలై (33), అనిత (40), గురువమ్మాళ్ (55)గా పోలీసులు గుర్తించారు. కిచ్చనాయకన్‌పట్టి గ్రామంలో జరిగిన మరో ఘటనలో వెంబు (35) అనే వ్యక్తి మృతి చెందగా.. ఇద్దరు మహిళల గాయపడ్డారు. క్షతగాత్రులను కాపాడిన రెస్క్యూ బృందం.. శ్రీవిళ్లిపుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ముఖ్యమంత్రి సంతాపం..
ఈ ఘటనలపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పును పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. క్షతగాత్రులకు ప్రత్యేక చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.