గూజరాత్లోని సూరత్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పల్సానా తాలుకా వరేలీ గ్రామంలో ఉన్న ఓ ప్యాకేజీ ఫ్యాక్టరీలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఘటనలో ఇద్దరు మృతిచెందారు. 48మంది గాయపడ్డారు. 125మందికిపైగా కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.
పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
08:23 October 18
పరిశ్రమలో అగ్నిప్రమాదం..
సోమవారం ఉదయం పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు అంబులెన్సులు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
మంటలు చెలరేగిన సమయంలో పరిశ్రమలో 200మంది ఉన్నట్టు సమాచారం. పరిశ్రమలోని నాలుగో అంతస్థు నుంచి క్రేన్ల సహాయంతో కార్మికులను బయటకు తీశారు. ఈ సమయంలో పైపు పట్టుకుని, అదుపు తప్పి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.
సూరత్ మేయర్ హిమాలి బఘోవాలా ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.