మహారాష్ట్రలో మరో విషాదం చోటు చేసుకుంది. పాల్గఢ్ జిల్లా వాసాయిలోని విజయ్ వల్లభ్ ఆస్పత్రి రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో మంటలు చెలరేగడం వల్ల.. చికిత్స పొందుతున్న 14 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయని స్పష్టం చేశాయి.
ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆస్పత్రిలో ఫర్నీచర్, ఇతర సామగ్రి మొత్తం కాలి బూడిదయింది.
ఏసీ వల్లే!
ఐసీయూలోని ఏసీ యూనిట్‌లో పేలుడు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం నుంచి ఐసీయూలో ఏసీ పనిచేయడం లేదని.. దానికి మరమ్మతులు జరగుతున్నాయని ఆస్పత్రి సిబ్బంది ఒకరు తెలిపారు. ఆస్పత్రిలోని ఏసీ వ్యవస్థలో సమస్య ఉందని వివరించారు.
"అగ్ని ప్రమాద సమయంలో ఆస్పత్రిలో మొత్తం 90 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో 18 మంది ఉన్నారు. నలుగురిని ప్రమాదం నుంచి రక్షించాం. ఆస్పత్రిలోని ఇతర విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులు సురక్షితంగా ఉన్నారు."
--డాక్టర్ దిలీప్ షా, వల్లభ్ కొవిడ్ కేర్ హాస్పిటల్ డైరెక్టర్.
శోకసంద్రంలో..
అగ్ని ప్రమాద సమయంలో.. ఆస్పత్రి సిబ్బంది నిద్రపోతున్నారని, రోగులను బయటకు తీసుకొచ్చేందుకు ఐసీయూలో ఒక్కరు కూడా లేరని మృతుల బంధువులు ఆరోపించారు. ఆస్పత్రిలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సామగ్రి లేదని విమర్శించారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తే మృతులందరూ బతికే వారని అన్నారు. అగ్ని ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు.