Fire Accident in Tirupati: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్స్ దుకాణంలో... ఉదయం పదిన్నర గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన దుకాణ సిబ్బంది బయటికి వచ్చిన కొద్దిసేపటికే మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు... చుట్టుపక్కల దుకాణాదారులను, హోటల్స్‌లో వసతి పొందుతున్న భక్తులను ఖాళీ చేయించారు. సమయం గడిచేకొద్దీ మంటలు భారీగా వ్యాపించడం... గోవిందరాజ స్వామి భక్తులను, స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఉవ్వెత్తున ఎగసిన మంటలను అదుపు చేయడం అగ్నిమాపక శాఖ సిబ్బందికీ కష్టతరమైంది.
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం.. 2 గంటల తర్వాత అదుపులోకి మంటలు - తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం
12:16 June 16
లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో ఎగసిపడుతున్న మంటలు
అగ్నిప్రమాదం జరిగిన భవనంలో దేవతామూర్తులను తయారు చేయడానికి వినియోగించే రసాయనాల కారణంగా మంటలు అధికంగా వ్యాప్తి చెందాయి. గురువారమే కోట్ల విలువైన ముడిసరుకు, ఇతర వస్తువులు దుకాణంలో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో దాదాపు 10 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని దుకాణదారులు చెబుతున్నారు.
అగ్నిప్రమాదం జరిగిన భవనానికి సమీపానే గోవిందరాజస్వామి రథం ఉండటం తీవ్ర ఆందోళన కలిగించింది. రథానికి మంటలు అంటుకునే ప్రమాదం ఉందనే ఆందోళనతో తితిదే అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. సంస్థకు చెందిన అగ్నిమాపక వాహనాలు, ట్యాంకర్లను ఘటనా స్థలానికి తెప్పించారు. రథం వరకు మంటలు వ్యాపించాయన్న ప్రచారాన్ని తితిదే ఈవో ధర్మారెడ్డి ఖండించారు.
ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని సుగుణమ్మ ఆరోపించారు. అగ్ని ప్రమాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం సరికాదని... ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. అగ్నిమాపకశాఖ, తితిదే, నగరపాలక సంస్థ సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.