Fire Accident In Surat: గుజరాత్.. సూరత్‌లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడం వల్ల ఏడుగురు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. ప్రమాదంలో అగ్నికి ఆహుతైన ఏడు మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం సూరత్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బుధవారం జరిగిందీ దుర్ఘటన.
సూరత్‌లోని సచిన్ జీఐడీసీ కెమికల్ ఫ్యాక్టరీలో నవంబర్ 29వ తేదీన ఉదయం సుమారు రెండు గంటల సమయంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే 15 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. దాదాపు తొమ్మిది గంటలుపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో మృతి చెందిన ఏడుగురిలో ఒకరు ఉద్యోగి కాగా మిగిలిన ఆరుగురు కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్నారని సూరత్ కలెక్టర్ ఆయూష్ ఓక్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన 24 మందిని వివిధ ఆస్పత్రుల్లో చిక్సిత పొందుతున్నారని కలెక్టర్ అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలోని పెద్ద ట్యాంకులో నిల్వ ఉండే మండే రసాయనాలు లీకేజి కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సూరత్ ఫైర్ చీఫ్ ఆఫీసర్ బసంత్ పరీక్ వెల్లడించారు.