నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం- మంటల్లో చిక్కుకుని 9 మంది మృతి
మంటలు చెలరేగి తొమ్మిది మంది దుర్మరణం, మృతుల్లో 4 రోజుల పసికందు
Fire Accident in Nampally Today : హైదరాబాద్ మహానగరం మరోసారి ఉలిక్కిపాటుకు గురైంది. నాంపల్లి బజార్‌ఘాట్‌లోని ఓ భవనంలో మంటలు చెలరేగి.. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కారు రిపేర్ గ్యారేజ్‌లో.. ఓ కారును రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో పక్కనే ఉన్న డీజిల్, కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలోనే గ్యారేజ్ నుంచి అపార్ట్‌మెంట్ పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు.. భవనమంతా వ్యాపించాయి. నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించగా.. అందులో ఉన్న వారంతా మంటల్లో చిక్కుకున్నారు. అపార్ట్‌మెంట్‌లోని మూడు, నాలుగు అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటుండగా.. అప్పటికే దట్టమైన పొగ కమ్మేసింది. ఈ క్రమంలోనే ఊపిరాడక అపార్ట్‌మెంట్‌లో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. గ్యారేజ్‌లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను సిబ్బంది బయటకు తెచ్చారు.
Fire Accident in Hyderabad Today : అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించి, తొలుత మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం, సహాయక సిబ్బంది భవనంలోకి వెళ్లి.. అతికష్టం మీద మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. అప్పటికే చనిపోయిన వారి మృతదేహాలతో పాటు.. 21 మందిని బయటికి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పారు.
Fire Accident BazarGhat Today :గ్యారేజ్‌లో చాన్నాళ్లుగా కెమికల్ డ్రమ్ములు నిల్వ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. మంటల్లో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారని.. మృతుల్లో 4 రోజుల పసికందు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. సహాయక చర్యలను అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి, మధ్యమండల డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కారు రిపేర్ గ్యారేజ్ ఉందని డీసీపీ తెలిపారు. గ్యారేజ్‌లో కారు రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని చెప్పారు. అక్కడే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉన్నాయని పేర్కొన్నారు. రసాయన డ్రమ్ముల వల్ల అపార్ట్‌మెంట్ పై అంతస్తులకు మంటలు వ్యాపించాయని ఆయన వివరించారు.