Fire Accident in Falaknuma Express : రైల్వే సిబ్బంది అప్రమత్తతో.. హావ్ డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ప్రాణాపాయం తప్పింది. హావ్‌డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో.. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరు బోగీలు దగ్ధమయ్యాయి. మరిన్ని బోగీలకు మంటలు వ్యాపించకుండా వాటిని విడదీసి... మంటలు విస్తరించకుండా జాగ్రత్తపడ్డారు.
ఈ ప్రమాదంలో ఎస్4, ఎస్5, ఎస్6 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. వివిధ చోట్ల నుంచి అగ్నిమాపక యంత్రాలు రప్పించిన అధికారులు.. మంటలు అదుపు చేశారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్న అధికారులు.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో విలువైన వస్తువులు కోల్పోయినట్లు చెప్పారు.
Falaknuma Express Fire Accident :విషయం తెలిపిన వెంటనే రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. విచారణ పూర్తైన తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు.
Fire Accident in Falaknuma Express :ఆ తర్వాత మిగిలిన బోగీలతో కలిసి రైలును సికింద్రాబాద్‌కు తీసుకొచ్చారు. మరోవైపు ప్రత్యేక బస్సుల్లో ఘటనా స్థలం నుంచి ప్రయాణికులను సికింద్రాబాద్‌కు తరలించారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ఒడిశా ప్రమాదం తర్వాత కూడా భద్రత చర్యలు లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో బ్యాగులు కాలిపోయాయని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశామని వాపోయారు.
Falaknuma Express :ఈ క్రమంలోనే నగదు, సామగ్రి కోల్పోయామని కొందరు ప్రయాణికులు వివరించారు. మరోవైపు అగ్నిప్రమాదంతో రెండు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. మరో నాలుగు రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించింది. మంటలు చెలరేగడానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: