ఉత్తరప్రదేశ్‌లో దుర్గామాత మండపం వద్ద జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు మరణించారు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భదోహిలోని దుర్గామాత మండపంలో పూజలు చేసి హారతి ఇస్తుండగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మండపం మొత్తం వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ దాదాపు 150 మంది ఉన్నారు. మంటల కారణంగా వీరిలో 64 మంది గాయపడ్డారు.
దుర్గా మండపంలో అగ్నిప్రమాదం- ఐదుగురు మృతి - up fire accident
దసరా నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. ఉత్తర్ప్రదేశ్ భదోహిలో దుర్గమ్మ మండపంలో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కాగా మిగిలిన ఇద్దరు మహిళలు.
అగ్నిప్రమాదంతో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మొత్తం 52 మంది క్షతగాత్రుల్ని వేర్వేరు ఆస్పత్రులకు సహాయక సిబ్బంది తరలించారు.
అగ్ని ప్రమాదంలో మండపం పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు భదోహి జిల్లా కలెక్టర్ గౌరంగ్ రాఠీ చెప్పారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.