Fire Accident BBMP Office Bangalore :కర్ణాటక.. బెంగళూరులోని బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహా నగర పాలికే) కార్యాలయ ఆవరణలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్, వెస్ట్ డివిజన్ అదనపు పోలీసు కమిషనర్ సతీశ్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
"బీబీఎంపీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన లేబరేటరీలో ఈ ప్రమాదం జరిగింది. ఓవెన్ బాక్స్ లీక్ కావడం వల్లే మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. గాయపడిన ఉద్యోగులను విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. అందులో నలుగురు తీవ్రమైన కాలినగాయాలతో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాం. అగ్నిప్రమాదానికి గల అసలు కారణం దర్యాప్తు తర్వాత తెలుస్తుంది" అని పశ్చిమ డివిజన్ అదనపు పోలీసు కమిషనర్ సతీశ్ తెలిపారు.
Bangalore Fire Accident Today : "శుక్రవారం సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య కార్యాలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పుడు వెనుక ఉన్న లేబరేటరీలో మంటలు చెలరేగుతున్నట్లు కొందరు ఉద్యోగులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాం. ప్రథమ చికిత్స అందించి గాయపడిని ఉద్యోగులను అంబులెన్స్‌లో విక్టోరియా ఆస్పత్రికి తరలించాం" అని బీబీఎంపీ చీఫ్ కమీషనర్ తుషార్ గిరినాథ్ మీడియాతో తెలిపారు.