తెలంగాణ

telangana

కేంద్ర మంత్రిత్వ శాఖల్లోనూ భారీ మార్పులు

By

Published : Jul 7, 2021, 3:32 PM IST

కేంద్ర మంత్రిత్వ శాఖలలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఓ విభాగాన్ని.. ఆర్థిక శాఖకు బదలాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని విభాగాల సంఖ్య ఆరుకు చేరింది.

fin min
కేబినెట్ మార్పులు

మంత్రులతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రాగా.. తాజాగా ఆర్థిక శాఖలోనూ మార్పులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రజా సంస్థల విభాగాన్ని(పబ్లిక్ ఎంటర్​ప్రైజ్ డిపార్ట్​మెంట్).. ఆర్థిక శాఖ గొడుగు కిందకు తీసుకొచ్చింది.

ఫలితంగా.. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని విభాగాల సంఖ్య ఆరుకు చేరింది. ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయ, పెట్టుబడి, ప్రజా ఆస్తుల నిర్వహణ, ఆర్థిక సేవల విభాగాలు ఇప్పటికే ఈ శాఖ పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ మెరుగ్గా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ సంస్థల పెట్టుబడి వ్యయాలు, ఆదాయాలు, ఆర్థిక పరిస్థితిపై పర్యవేక్షణ సులభమవుతుందని పేర్కొంది.

ప్రజా సంస్థల విభాగం ఇదివరకు 'భారీ పరిశ్రమలు, ప్రజా సంస్థల మంత్రిత్వ శాఖ'లో అంతర్భాగంగా ఉంది. ఇకపై ఈ శాఖను 'భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ'గా పిలవనున్నారు. 44 సంస్థల బాధ్యత ఈ శాఖపై ఉంది. ఇందులోని చాలా సంస్థలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.

కొత్తగా సహకార మంత్రిత్వ శాఖ

మరోవైపు, కేంద్ర మంత్రివర్గంలో నూతనంగా ఓ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని సమాచారం. కేంద్ర సహకార శాఖ పేరుతో ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఈ శాఖ లక్ష్యమని తెలిపాయి.

ఇదీ చదవండి:మోదీ కేబినెట్​లో భారీ మార్పులు- కొత్తగా 43 మంది...

ABOUT THE AUTHOR

...view details