2022-2023 ఆర్థిక సర్వేను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. అయినా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటుందని తెలిపింది. అమెరికా వడ్డీ రేట్ల పెంపు సహా మరికొన్ని అంతర్జాతీయ పరిణామాలతో రూపాయికి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. వృద్ధిరేటు అంచనా ఇలా.. - ఆర్థిక సర్వే 2023 ఆర్థిక లోటు
2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. వృద్ధిరేటును 6.5 శాతంగా సర్వే అంచనా వేసింది. దేశీయంగా వినియోగం పెరుగుతున్నందున్న ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపింది.
ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు :
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.5 శాతం ఉండొచ్చు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 7 శాతం. 2021-22లో ఇది 8.7శాతంగా ఉంది.
- ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలను బట్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. జీడీపీ వృద్ధి 6 నుంచి 6.8 శాతం ఉంటుంది.
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
- ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంది. ఇది ప్రవేటు వివియోగాన్ని, పెట్టుబడులు బలహీనపరచలేదు.
- కొనుగోలు శక్తి పరంగా భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ, ఎక్స్చేంజ్ రేటు పరంగా.. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
- కరోనా మహమ్మారి వ్యాప్తి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఐరోపాలో సంక్షోభం కారణంగా మందగించిన దేశ వృద్ధిరేటు.. మళ్లీ పుంజుకుంది.
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. మూలధన పెట్టుబడులు పుంజుకుంటాయి.
- పీఎం కిసాన్, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాలు పేదరికాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడ్డాయి.
- దేశీయంగా వినియోగం పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అయితే, మరిన్ని ఉద్యోగాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలి.
- ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఎమ్ఎస్ఎమ్ఈలకు రుణ వితరణను మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ప్రతికూల పరిస్థితుల్లోనూ దీటుగా..
"ప్రపంచం మాదిరిగానే భారత్ కూడా ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసే సవాళ్లు ఎదుర్కొంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిన్నా.. చాలా ఆర్థిక వ్యవస్థల కన్నా భారత్ దీటుగా నిలబడింది. ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేసిన మహమ్మారి ప్రభావం నుంచి త్వరగా కోలుకుంది. ఇది దేశీయంగా ఉన్న డిమాండ్, పెట్టుబడుల కారణంగా సాధ్యపడింది. కానీ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం వల్ల రూపాయికి సవాళ్లు ఎదురయ్యాయి." అని ఆర్థిక సర్వే నివేదిక పేర్కొంది.
ఇవీ చదవండి :