రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి(Resident Grievance Officer) నియామకం తుది దశకు చేరుకుందని దిల్లీ హైకోర్టుకు సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్(Twitter) వెల్లడించింది. తాము నియమించిన మధ్యంతర గ్రీవెన్స్ అధికారి జూన్ 21న పదవి నుంచి వైదొలిగారని ధర్మాసనానికి తెలిపింది.
ఈ స్థానంలో మరొకరిని నియమించే లోపు.. భారతీయ వినియోగదారుల సమస్యలను జనరల్ గ్రీవెన్స్ అధికారి ద్వారా పరిష్కరిస్తామని ట్విట్టర్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐటీ రూల్స్ పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌కు స్పందనగా దిల్లీ హైకోర్టుకు సంస్థ వెల్లడించింది. అనంతరం, దీనిపై విచారణను జులై 6కు వాయిదా వేసింది ధర్మాసనం.
కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ చట్టాల ప్రకారం భారత్‌కు చెందిన వ్యక్తిని రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిగా నియమించాల్సి ఉంటుంది. వినియోగదారులు చేసే ఫిర్యాదులకు సదరు హోదాలో ఉన్న అధికారి స్పందించాల్సి ఉంటుంది.