దాదాపు మూడున్నర దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఫిఫా ప్రపంచకప్‌ను గెలుచుకుంది అర్జెంటీనా. దీంతో కేవలం అర్జెంటీనాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు సంబరాలు చేసుకొంటున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనా విజయం సాధిస్తే 1000 ప్లేట్ల బిర్యానీలను ఉచితంగా పంచుతానని కేరళకు చెందిన ఓ హోటల్ నిర్వహకుడు వాగ్దానం చేశాడు. ఉత్కంఠభరితంగా సాగిన నిన్నటి ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం.. హోటల్ నిర్వాహకుడు బిర్యానీలను ఉచితంగా పంపిణీ చేశాడు.
కేరళ త్రిశూర్ జిల్లాలోని పల్లిమూల ప్రాంతంలో శిబు అనే వ్యక్తి ఓ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. ఫుట్‌బాల్ క్రీడలో దక్షిణ అమెరికా జట్టును అభిమానించే ఆయన.. ఫైనల్‌లో అర్జెంటీనా విజయం సాధిస్తే వెయ్యి బిర్యానీలను ఉచితంగా పంపిణీ చేస్తానని ప్రకటించాడు. అతడు ఆశించినట్టుగానే ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం సాధించింది. దీంతో ఆయన ఆనందంగా బిర్యానీలు పంపిణీ చేయగా.. ఆయన హోటల్‌కు ప్రజలు క్యూ కట్టారు. ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి బిర్యానీలను పంచాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో అదనంగా మరో 500 మందికి అందించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ముప్పై ఆరేళ్ల తర్వాత అర్జెంటీనా గెలిచిన నేపథ్యంలో బిర్యానీలను ఉచితంగా పంపిణీ చేయడం సంతోషంగా ఉందని శిబు పేర్కొన్నాడు.