up election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న కమలదళం.. గోరఖ్‌పుర్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రధానంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభపైనే ఆశలు పెట్టుకుంది. అందుకే వ్యూహాత్మకంగా ఆయన్ను స్థానిక గోరఖ్‌పుర్ అర్బన్ స్థానం నుంచి ఈ దఫా ఎన్నికల బరిలో దించింది. ఆయన పోటీతో.. ప్రాంతీయంగా ఇతర సీట్లలోనూ పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఆశిస్తోంది. మరోవైపు- స్థానికంగా బలమైన నేతలుగా పేరున్న తాజా మాజీ మంత్రులు స్వామిప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ వంటివారి చేరికతో సమాజ్‌వాదీ పార్టీకి (ఎస్పీ) కూడా ఇక్కడ పట్టు పెరిగింది.
సగానికిపైగా ఓబీసీలే
ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీ వ్యవస్థాగత నిర్మాణాన్ని భాజపా ఆరు భాగాలుగా విభజించింది. అవి- పశ్చిమ జోన్, బ్రజ్ ప్రాంతం, కాన్పుర్-బుందేల్‌ఖండ్, అవధ్, గోరఖ్‌పుర్, కాశీ. గోరఖ్‌పుర్ ప్రాంతంలో- గోరఖ్‌పుర్, మహారాజ్‌గంజ్, దేవరియా, కుశినగర్, బస్తీ, సంత్ కబీర్‌నగర్, సిద్ధార్థ్‌నగర్, ఆజంగఢ్, బలియా, మవూ జిల్లాలున్నాయి. ఈ ప్రాంత ఓటర్లలో సగానికి పైగా ఓబీసీలే. ఇందులో ప్రధానంగా మౌర్య, కుశ్వాహా, నొనియా-చౌహాన్ వర్గాల ప్రజలు ఎక్కువ. ఇక్కడ ఎస్సీలు 20% ఉంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, కాయస్థుల వంటి అగ్రవర్ణాలవారు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. ఆజంగఢ్, మవూ, పడ్రౌనా సహా దాదాపు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లూ ప్రభావశీల స్థాయిలో ఉన్నారు.
నాడు యోగి అండతో..
గోరఖ్‌పుర్ ప్రాంత ప్రజలు యోగిని 'మహా రాజ్ జీ' అని పిలుస్తుంటారు. ఆయన స్థానిక గోరఖ్‌నాథ్ మఠాధిపతి కావడమే అందుకు కారణం. 1998 నుంచి యోగి గోరఖ్‌పుర్ స్థానంలో ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. ఆయన స్థాపించిన 'హిందూ యువ వాహిని' ప్రాబల్యం స్థానికంగా ఎక్కువే. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి యోగి ఎంపీగా ఉన్నారు. అప్పట్లో ఆయన దాదాపుగా రాష్ట్రమంతటా పర్యటించినా.. ప్రధానంగా గోరఖ్‌పుర్ ప్రాంతంలో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఫలితంగా గోరఖ్‌పుర్ ప్రాంతంలో మొత్తం 62 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 44 భాజపా వశమయ్యాయి. ఎస్పీ, బీఎస్పీ ఇక్కడ చెరో ఏడు సీట్లతో సరిపెట్టుకున్నాయి. ప్రస్తుతం గోరఖ్‌పుర్ ప్రాంత అభ్యర్థుల ఎంపికలో యోగి తనదైన ముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పెరిగిన ఎస్పీ బలం