సంతాన సాఫల్యతకు సాయం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని డబ్బులు కురిపించే పరిశ్రమగా చూడొద్దని వైద్య-ఆరోగ్యశాఖ పార్లమెంటరీ స్థాయిూ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుపై ఈ సంఘం అధ్యయనం చేసింది. అందులో సంతాన సాఫల్యతను లాభదాయక పరిశ్రమగా పరిగణించడాన్ని తప్పుబట్టింది. దీని ద్వారా బిలియన్ డాలర్లు ఆర్జించవచ్చని, వ్యాపార వృద్ధికి దండిగా అవకాశాలు ఉంటాయని పేర్కొనడాన్నీ తప్పుబట్టింది. ఇది చాలా బాధాకరమైన విషయమని వ్యాఖ్యానించింది. పేదల భాదలను, ధనవంతుల అవకాశాలను వ్యాపార వస్తువుగా మలుచుకునే ధోరణితో రూపొందించిన ఈ బిల్లు పరోపకార స్ఫూర్తిని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
'సంతాన సాఫల్య కేంద్రాలు లాభార్జన పరిశ్రమలు కాదు' - ఐవీఎఫ్ సెంటర్లు
ప్రభుత్వం తీసుకొచ్చిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుపై వైద్య-ఆరోగ్యశాఖ పార్లమెంటరీ స్థాయిూ సంఘం అధ్యయనం చేసింది. సంతాన సాఫల్యతకు సాయం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు లాభార్జన పరిశ్రమగా చూడడాన్ని తప్పుపట్టింది. ఇది చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు వారికే వదిలేయకుండా ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రిల్లో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అప్పుడే పేదలకు ఇలాంటి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడింది. ఐవీఎఫ్ సెంటర్లను వ్యాపార కేంద్రాలుగా నిర్వహించే విధానాన్ని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించింది. చికిత్సల ధరల విషయమై నిర్ణీత విధానాలను రూపొందించాలని సిఫార్సు చేసింది. డిప్లొమా హోల్డర్లు, ఎండీలు ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయకుండా చూడాలని, ఇందుకోసం ఏడాది, రెండేళ్లు కాలపరిమితితో ప్రత్యేక ఏఅర్టీ కోర్సులు ప్రవేశపెట్టాలని పేర్కొంది. మగవారి లైంగిక సామర్థ్యాలు, వారి సంతాన సాఫల్య సమర్థతను పరీక్షించేందుకు వీలుగా ఏఆర్టీ క్లినిక్‌ల్లో ఆండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.