బంగాల్ బర్ధమాన్ జిల్లాలో దారుణం జరిగింది. 'నాలుగేళ్లపాటు కలసిఉన్న తమ బంధాన్ని పట్టించుకోకుండా.. తనను దూరం పెడుతున్నాడని' ఆరోపిస్తూ ఏకంగా ప్రియుడిపైనే కాల్పులకు తెగబడిందో మహిళ. బుధవారం రాత్రి కత్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే బుల్లెట్ బాధితుడి పొత్తికడుపును తాకుతూ వెళ్లిందని.. దీనితో పెద్దగా ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.
ఇదీ జరిగింది..
ఉద్యోగం కోసం కొన్ని నెలల క్రితం ఝార్ఖండ్ వెళ్లిన నిందితురాలు.. ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో తన ప్రియుడిని కలవాలని ఉందని.. స్థానిక సర్కస్ మైదానానికి రమ్మని కోరింది. అతను వెళ్లిన అనంతరం ఈ దారుణానికి పాల్పడింది.
"నేను మైదానానికి వెళ్లగానే ఆమె నన్ను కౌగిలించుకుంది. ముద్దు పెట్టుకుంది. కలసి సిగరెట్లు కాల్చాం. ఏమైందో ఏమో.. తుపాకీ తీసి అమాంతం నాపై కాల్పులు జరిపింది"
-బాధితుడు
కాల్పుల అనంతరం అక్కడినుంచి పారిపోయిన మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 'గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య దూరం పెరగడం వల్లే మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని' వెల్లడించారు.