Cheetah Died In Kuno : మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో మరో చీతా మృతి చెందింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన దక్ష అనే ఆడ చీతాపై రెండు మగ చీతాలు దాడి చేయడం వల్ల గాయపడినట్లు అటవీ అధికారులు తెలిపారు. గాయపడిన చీతాకు చికిత్స చేయిస్తుండగా.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతి చెందినట్లు చెప్పారు. మగ చీతాలు వాయు, అగ్ని ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి ఆడ చీతా దక్షను పునరుత్పత్తి కోసం ఉంచారు. అయితే రెండు మగ చీతాలు దక్ష మీద దాడి చేసినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో రెండు ఇదివరకే మరణించాయి.
కునో నేషనల్ పార్క్‌లో ఆడ చీతా మృతి.. 42 రోజుల వ్యవధిలో మూడో మరణం
Cheetah Died In Kuno : దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న చీతాల్లోని ఓ ఆడ చీతా మరణించింది. రెండు మగ చీతాలు దాడి చేయడం వల్ల ఆడ చీతా మరణించినట్లు అధికారులు తెలిపారు.
గత నెలలో మగ చీతా మృతి..
ప్రాజెక్ట్ చీతాలో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇప్పటివరకు 20 చీతాలను భారత్ దిగుమతి చేసుకుంది. చీతాల గుంపులో 'ఉదయ్' అనే 6 సంవత్సరాల వయసున్న మగ చీతా ఈ ఏడాది ఏప్రిల్ 23న మరణించింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు. మరణించిన చీతా అస్వస్థతకు గురైందని.. చికిత్స పొందుతూ మృతి చెందిందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ ధ్రువీకరించారు. అంతకుముందు ఈ ఏడాది మార్చి 27న కూడా నమిబీయా నుంచి తీసుకొచ్చిన సాషా అనే చీతా కిడ్నీ వ్యాధి కారణంగా ఇదే పార్క్‌లో ప్రాణాలు విడిచింది. కాగా, గత 42 రోజుల వ్యవధిలోనే మూడు చీతాలు మరణించడం గమనార్హం.
7 దశాబ్దాల తర్వాత..
భూమి మీద అత్యంతవేగంగా పరిగెత్తే జంతువు చీతా. ఇవి భారత్‌లో 74 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. 1947లో ఛత్తీస్‌గఢ్‌లో దేశంలోని చివరి చీతా చనిపోయింది. దీంతో 1952లో చీతాలు పూర్తిగా అంతరించిపోయినట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశంలో చిరుతల సంఖ్యను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం విదేశాల నుంచి చీతాలను పలు దఫాలుగా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మొదటి విడత కింద గతేడాది సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా.. నమీబియా నుంచి 8 చీతాలను భారత్ దిగుమతి చేసుకుంది. వీటిలో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. వీటిలో 7 మగ, 5 ఆడ చిరుతలు ఉన్నాయి.