కేంద్రంతో చర్చలకు రైతుసంఘాల సమాఖ్య అంగీకారం - రైతుల నిరసన కేంద్రం
17:13 December 26
కేంద్రంతో చర్చలకు రైతుసంఘాల సమాఖ్య అంగీకారం
కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రైతు సంఘాల సమాఖ్య అంగీకారం తెలిపింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. డిసెంబర్ 29 న ఉదయం 11 గంటలకు సమావేశం చర్చలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు 40 రైతు సంఘాల తరపున కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శికి వివేక్ అగర్వాల్‌కు.. రైతు సంఘాల సమాఖ్య లేఖ రాసింది.
ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రైతు సంఘాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయని రైతు సంఘాల సమాఖ్య పేర్కొంది. తాము సూచించిన అంశాలపై చర్చించడానికి సుముఖంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
సమావేశంలో చర్చించాల్సిన విషయాలపై రైతు సంఘాల సమాఖ్య సూచనలు:
- మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులు
- జాతీయ రైతు కమిషన్ సూచించిన కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, అందుకు అవసరమైన విధాన రూపకల్పన
- ఆర్డినెన్స్‌లో పేర్కొన్న శిక్షా నిబంధనల నుంచి రైతులను మినహాయించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం
- దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్య నివారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్ 2020కి సవరణలు చేయడం
- రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అనుగుణంగా 'విద్యుత్ సవరణ బిల్లు 2020' ముసాయిదాలో అవసరమైన మార్పులు