లోక్ జనశక్తి పార్టీపై చిరాగ్ పాసవాన్(Chirag Paswan) పట్టుకోల్పోవడం... ఎంపీలు తమ పార్లమెంటరీ పక్షనేతను మార్చుకోవాలని తీర్మానించడం.. పార్టీ అధ్యక్ష పదవిని సైతం చిరాగ్‌కు దూరం చేయడం వంటి పరిణామాలతో బిహార్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎల్జేపీలో అంతర్గత కుమ్ములాటలకు సీఎం నితీశ్ కుమారే కారణమంటూ వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో భగ్గుమన్నాయి. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్(RJD) పార్టీ ఈ వివాదం మొదలైనప్పటి నుంచి.. ఒక్క మాటా మాట్లాడలేదు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఎల్జేపీ ప్రతిష్టంభనపై నోరుమెదపలేదు. ఇవే కాదు! గతంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జేఎన్‌యూ కన్నయ్య కుమార్ వివాదం, జన్ అధికార్ పార్టీ పప్పూ యాదవ్ ఘటనపైనా.. మౌనాన్నే ఆశ్రయించింది ఆర్జేడీ.
ఎందుకు?
నిజానికి తేజస్వీ(Tejashwi Yadav)తో పాటు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గానే ఉంటారు. దాదాపు వారం నుంచి.. ఈ వివాదం నడుస్తున్నప్పటికీ వీరిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, ఆర్జేడీ మౌనం వెనక కారణాలు లేకపోలేదు. ఈ వివాదాలపై స్పందించి యువనేతలకు మరింత ప్రాచుర్యం కల్పించడం ఇష్టంలేకే ఆ పార్టీ నేతలు మిన్నకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తేజస్వీ యాదవ్ మినహా ఇతర యువకులు రాజకీయంగా ఎదగకూడదని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారని అంటున్నారు.
ఆర్జేడీతో పాటు మహాగట్బంధన్కు కూడా తేజస్వీ యాదవే ముఖచిత్రంగా ఉన్నారు. లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నప్పుడు తేజస్వీ.. పార్టీని సమర్థవంతంగా నడిపించారు. కాబట్టి తేజస్వీ ఇమేజ్ విషయంలో ఆర్జేడీ నేతలు రాజీ పడటం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
"ఎవరైనా యువ రాజకీయ నేత తమ గుర్తింపు కోసం పాటుపడుతుంటే లేదా.. బాగా ప్రాచుర్యంలోకి వస్తే ఆర్జేడీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. వారిపై ఏదైనా మాట్లాడితే అది తిరగబడి పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్జేడీ భయపడుతుంది. కన్నయ్య కుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. విపక్షంలో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా కన్నయతో తేజస్వీ స్టేజీ పంచుకోలేదు. యువకులు కీలకంగా ఉన్న పార్టీలతో ఆర్జేడీ ఎప్పుడూ అనుబంధం పెంచుకోదు. ప్రజాస్వామ్య విధానంలో ఇలాంటివి ప్రశంసించదగినవి కాదు. దురదృష్టవశాత్తు ఆర్జేడీ అధినాయకత్వం మౌనంగానే ఉంటోంది."
-డాక్టర్ సంజయ్ కుమార్, పట్నాలోని రాజకీయ విశ్లేషకులు